1388 మంది పోలీసులకు కరోనా….12 మంది మృతి
కరోనా భూతం ఖాకీలను వణికిస్తోంది. పోలీసు సిబ్బందిని పెద్ద సంఖ్యలో సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. దీంతో పోలీసు శాఖలో సిబ్బంది కొరత కూడా కనిపిస్తోంది
కరోనా భూతం ఖాకీలను వణికిస్తోంది. దేశంలో వేగంగా విస్తరిస్తోన్న వైరస్ బారిన నుంచి ప్రజల్ని కాపాడేందుకు రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్న పోలీసులు పెద్ద సంఖ్యలో కోవిడ్ బారినపడుతుండటం ఆందోళన రేపుతోంది. మహారాష్ట్రలో వైరస్ కారణంగా ఇప్పటి వరకు 12 మంది పోలీసులు మృత్యువాతపడ్డారు.
కోవిడ్ ధాటికి మహారాష్ట్ర చిగురుటాకుల వణికిపోతోంది. మహారాష్ట్రలోనే పెద్ద సంఖ్యలో పోలీసులు కరోనాకు బలవుతున్నారు. బుధవారం నాటికి రాష్ట్రంలో 1,388పోలీసులకు వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 948గా ఉందని రాష్ట్ర పోలీసు శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 428 మందికి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ కాగా, 12 మంది మృత్యువాత పడినట్టు తెలిపింది. ముంబైలో పోస్ట్ చేసిన ఏఎస్ఐ మధుకర్ మనే గత వారం కరోనాతో కన్నుమూశాడు.
డీజీపీ సహా, మహారాష్ట్ర పోలీసులంతా తమ సంతాపం తెలియజేశారు. పోలీసు సిబ్బందిని పెద్ద సంఖ్యలో సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. దీంతో పోలీసు శాఖలో సిబ్బంది కొరత కూడా కనిపిస్తోంది. వారి స్థానంలో 2000 మంది అదనపు పోలీసులను సీఆర్‌పీఎఫ్ నుంచి పంపాలని కేంద్రాన్నికోరింది మహారాష్ట్ర ప్రభుత్వం. మహారాష్ట్రలో మొత్తం 37,136 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య 1,325కు చేరింది.