AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs ZIM: ఆ ఇద్దరు అవుట్.! ఓపెనింగ్‌లో అన్‌లక్కీ స్టార్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..

దక్షిణాఫ్రికాతో ఓటమి తర్వాత జింబాబ్వేతో టీమిండియా మ్యాచ్ కీలకంగా మారింది. సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో భారత్ తప్పక గెలవాలి. వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ తిరిగి జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తుండగా, తిలక్ వర్మ స్థానంలో సంజూ శాంసన్ వచ్చే అవకాశం ఉంది. నెట్ రన్ రేట్‌ను మెరుగుపరచుకోవడం కూడా అత్యవసరం.

IND Vs ZIM: ఆ ఇద్దరు అవుట్.! ఓపెనింగ్‌లో అన్‌లక్కీ స్టార్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
Team India T20i World Cup 2026
Ravi Kiran
|

Updated on: Feb 24, 2026 | 1:49 PM

Share

దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఎదురైన ఘోర పరాజయం టీమిండియాపై తీవ్ర ఒత్తిడిని పెంచింది. సూపర్ 8 దశలో సెమీఫైనల్ రేసులో నిలవాలంటే 26వ తేదీన చెన్నైలో జింబాబ్వేతో జరగనున్న తదుపరి మ్యాచ్ భారత్‌కు అత్యంత కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో తుది జట్టులో కీలక మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన గత మ్యాచ్‌లో భారత్ 76 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు నిరాశపరిచారు. కేవలం శివం దూబే 42 పరుగులు మినహా మరే ఇతర బ్యాటర్ కూడా 20 పరుగుల కంటే దాటలేకపోయారు. ఈ వైఫల్యం జట్టు మేనేజ్‌మెంట్‌ను పునరాలోచనలో పడేసింది. వరుసగా రెండోసారి టి20 ప్రపంచ కప్ ఛాంపియన్‌గా నిలవాలనే భారత ఆశలు నెరవేరాలంటే జింబాబ్వే, వెస్ట్ ఇండీస్‌లపై భారీ తేడాతో విజయం సాధించడం తప్పనిసరి. వెస్ట్ ఇండీస్ ఇప్పటికే జింబాబ్వేపై భారీ విజయం సాధించడంతో, నెట్ రన్ రేట్ కూడా అత్యధికంగా ఉంది. దీంతో భారత్ చివరి రెండు మ్యాచ్‌లు గెలవడమే కాకుండా భారీ నెట్ రన్ రేట్ సంపాదించాలి.

ఈ క్రమంలోనే జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌లో కీలక మార్పులతో పాటు బ్యాటింగ్ ఆర్డర్‌లో కూడా మార్పులు ఉంటాయి. ముఖ్యంగా వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ మళ్ళీ జట్టులోకి రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. గత మ్యాచ్‌లో అక్షర్ పటేల్‌ను పక్కన పెట్టడంపై అభిమానులు, సునీల్ గవాస్కర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడి స్థానంలో వచ్చిన వాషింగ్టన్ సుందర్ బంతితోను, బ్యాట్‌తోను ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. స్పిన్‌కు అనుకూలించే చెన్నై పిచ్‌పై అక్షర్ పటేల్ తన ఆల్‌రౌండ్ ప్రతిభతో జట్టుకు వెన్నెముకగా నిలిచే అవకాశం ఉంది.

ఓపెనింగ్ జోడిలో మార్పు అలాగే మూడో స్థానంలో బ్యాటింగ్ వస్తున్న తిలక్ వర్మ జింబాబ్వేతో మ్యాచ్ నుంచి తప్పించే అవకాశం ఉంది. తిలక్ వర్మ ఈ ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు తనదైన ముద్ర వేయలేకపోయాడు. గత మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి బాధ్యరహితమైన షాట్‌తో పెవిలియన్ చేరాడు. దీంతో కోచ్ గౌతం గంభీర్ కూడా తిలక్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో అతడి స్థానంలో సంజూ శాంసన్ తుది జట్టులోకి రానున్నాడు. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనర్‌గా వస్తే, మూడో స్థానంలో ఇషాన్ కిషన్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్లయిన ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మలపై ప్రత్యర్థి జట్లు రైట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్‌తో దాడి చేస్తున్న నేపథ్యంలో లెఫ్ట్-రైట్ కాంబినేషన్‌తో బరిలోకి దిగాలని టీం మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌కు ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై లాంటిదే. కేవలం గెలవడమే కాకుండా రన్ రేటు మెరుగుపరుచుకోవడం కూడా ముఖ్యం. అర్శదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాలతో కూడిన బౌలింగ్ విభాగం ఫామ్‌లో ఉండటం భారత్‌కు సానుకూల అంశం. మొత్తంగా, టీమిండియా ప్లేయింగ్ XI ఇలా ఉండే అవకాశం ఉంది: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్శదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.

Follow Us