Remdesivir : దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం, రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ ఎగుమతులపై నిషేధం
Remdesivir : కరోనా చికిత్సలో కీలకంగా భావిస్తోన్న ఔషదం రెమ్ డెసివిర్ విషయంలో కేంద్రం కొత్త నిర్ణయం చేసింది..
Remdesivir : కరోనా చికిత్సలో కీలకంగా భావిస్తోన్న ఔషదం రెమ్ డెసివిర్ విషయంలో కేంద్రం కొత్త నిర్ణయం చేసింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రతతో రోజుకు కేసులు లక్షకు పైబడుతున్న నేపథ్యంలో రెమ్ డెసివిర్ ఎగుమతుల్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ వైరస్‌పై చికిత్సలో ఉపయోగించే రెమ్ డెసివిర్ ఔషధానికి భవిష్యత్ లో డిమాండ్ పెరుగుతుందని అంచనా వేసిన కేంద్ర ప్రభుత్వం రెమ్ డెసివిర్ పంపిణీదారులు రెమ్ డెసివిర్ ను నిల్వచేయొద్దని ఆదేశించింది.
రెమ్ డెసివిర్ ఔషధ నిల్వల వివరాలను ఎప్పటికప్పుడు వెబ్ సైట్లో ఉంచాలని.. రెమ్ డెసివిర్ నిల్వలు బ్లాక్ మార్కెట్ కు తరలి పోకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయానికి వచ్చింది. యాంటీ వైరల్ డ్రగ్ గా సమర్థంగా పనిచేస్తుందని రెమ్ డెసివిర్ ఔషధంపై ప్రపంచ వైద్య నిపుణులు నమ్మకం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
కాగా, కరోనా కేసులు విజృంభించడంతో రెమ్ డెసివిర్ కు చాలా డిమాండ్ పెరుగుతోంది. దీనిని అదనుగా చేసుకొని కొంతమంది ప్రబుద్దులు ఈ మందును బ్లాక్‌మార్కెటింగ్ చేస్తున్నారు. పుణేలో రెమ్ డెసివిర్ మందును బ్లాక్‌మార్కెట్ చేస్తున్న నలుగురిని పోలీసులు నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రెమ్ డెసివిర్ ఇంజక్షన్ ఉత్పత్తిని పెంచడానికి ఔషధ కంపెనీలు సిద్ధమవుతున్నాయి.
ప్రామాణిక ట్రీట్‌మెంట్ ప్రోటోకాల్ ప్రకారం ఒక మాదిరి నుంచి తీవ్రంగా కొవిడ్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన కొవిడ్ రోగులకు రెమ్ డెసివిర్ తో చికిత్స చేస్తున్నారు. హెటిరో, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, జుబిలెంట్ లైఫ్ సైన్సె్‌సకు చెందిన జుబిలెంట్ జెనరిక్స్, మైలాన్, సిప్లా, జైడస్ క్యాడిలా, సన్ ఫార్మా.. రెమ్ డెసివిర్ ను తయారు చేస్తున్నాయి. కొవిడ్ కేసులు పెరగడంతో రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ల ఉత్పత్తిని పెంచమని కంపెనీలను ప్రభుత్వం కోరింది. దీంతో కంపెనీలు ఉత్పత్తి పెంచే ప్రక్రియలో ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.