బ్రిటన్ లో కరోనా వ్యాప్తి రెండో దశ షురూ..!

కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న దేశాల్లో బ్రిటన్ ఒకటి. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రెండో దశ ప్రారంభమైనట్టు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించడం మరింత కలవరానికి గురి చేస్తోంది.

  • Tv9 Telugu
  • Publish Date - 11:37 am, Sat, 19 September 20
బ్రిటన్ లో కరోనా వ్యాప్తి రెండో దశ షురూ..!

చైనాలో మొదలైన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోంది. కరోనా కారణంగా అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న దేశాల్లో బ్రిటన్ ఒకటి. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రెండో దశ ప్రారంభమైనట్టు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించడం మరింత కలవరానికి గురి చేస్తోంది. పరోక్షంగా మరోసారి కఠిన ఆంక్షలు తప్పకపోవచ్చని సంకేతాలు ఇచ్చారు.

యూరప్ దేశాల్లో బ్రిటన్‌పైనే కరోనా ఎక్కువ ప్రభావం చూపించింది. అక్క‌డ 42 వేల మంది ఈ మహమ్మారికి బలైయ్యారు. ఈ మధ్య కరోనా కేసులు తగ్గినా.. మళ్లీ విజృంభిస్తుంది. ఇప్పుడు జాగ్రత్త పడకపోతే పరిస్థితి మరింత దిగజారిపోయే అవకాశం ఉందిన వైద్య నిపుణ‌లు అంటున్నారు. అక్టోబర్‌లో రెండు వారాలపాటు లాక్‌డౌన్ విధించడం ద్వారా క‌రోనాకు ముకుతాడు వేయవచ్చని అభిప్రాయపడ్డారు.

అయితే బ్రిటన్‌లో మరోసారి లాక్‌డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆస్పత్రిలో చేరేవారు ప్రతీ ఎనిమిది రోజులకు రెండింతలు పెరుగుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతుంది. మరోసారి లాక్‌డౌన్ తప్పదని బ్రిటన్ ప్రభుత్వం హెచ్చరించింది. నిజానికి లాక్‌డౌన్‌ విధించేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదని.. అవసరమైతే మాత్రం అందుకు సిద్ధంగా ఉన్నామ‌ని బ్రిట‌న్‌ ఆరోగ్యశాఖ ప్రకటించింది.

బ్రిటన్ లో శుక్రవారం కొత్తగా 4,322 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మే నెల తర్వాత ఈ స్థాయిలో కొత్త కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో రెండో దశ వ్యాప్తి ప్రారంభమైందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు దేశంలో 3,88,412 కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 41,821 మంది చనిపోయారు.

కేసులు గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టడంతో నిర్ధారణ పరీక్షలు తగ్గించారనే విమర్శలు వెల్లువెత్తాయి. కొంత మంది పరీక్సల కోసం ఏకంగా కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చిందని స్థానిక మీడియా పేర్కొంది.