AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్‌డౌన్‌లో గృహప్రవేశం..యజమానికి ఊహించని షాకిచ్చిన పోలీసులు

కరోనా కల్లోల సమయంలో చాలా మంది అనేక కార్యక్రమాలు రద్దు చేసుకుంటున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు వాయిదా వేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రాండ్‌గా గృహప్రవేశం పెట్టుకున్న ఓ వ్యక్తికి పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు.

లాక్‌డౌన్‌లో గృహప్రవేశం..యజమానికి ఊహించని షాకిచ్చిన పోలీసులు
Jyothi Gadda
|

Updated on: Jul 02, 2020 | 7:04 PM

Share

ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా భయం వెంటాడుతోంది. ఎవరి నోట విన్నా వైరస్ వణుకతప్ప మరో మాట వినిపించటం లేదు. కరోనా కల్లోల సమయంలో చాలా మంది అనేక కార్యక్రమాలు రద్దు చేసుకుంటున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు వాయిదా వేసుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రాండ్‌గా గృహప్రవేశం పెట్టుకున్న ఓ వ్యక్తికి పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కరోనా కాలంలో ఓ వ్యక్తి నూతన గృహప్రవేశం పండగలా జరుపుకోవాలని భావించాడు. అందుకోసం బంధువులు, స్నేహితులను ఆహ్వానించాడు. పది మందో లేక 20 మందితోనే కార్యక్రమం పూర్తి చేసుకున్నాడ అంటే లేదు. ఏకంగా 200 మందిని గృహప్రవేశ వేడుకకు రావాల్సిందిగా కార్డ్స్ పంచిపెట్టుకున్నాడు. హంగు ఆర్భాటాలతో భారీగానే బంధుగణంతో కార్యం నిర్వహిస్తుండగా పోలీసులు రంగప్రవేశం చేశారు. దావత్‌కు విచ్చేసిన బంధువులు, స్నేహితులను హెచ్చరిస్తూ..అక్కడి నుంచి పంపించి వేశారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన ఇంటి యజమానికి ఏకంగా రూ. 7000ల జరిమానా విధించారు. కోవిడ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు గుంపులుగా గుమిగూడరాదని, విందు వినోద కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తూ..వైరస్ వ్యాప్తికి కారకులు కావొద్దని స్థానికులకు పోలీసులు సూచించారు.

మరోవైపు ఒడిషాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అన్‌లాక్ ‌1.0 ప్రారంభం నుంచి కేసుల సంఖ్య అమాంతం పెరుగుతున్నాయి. తాజాగా గురువారం నాడు కొత్తగా మరో 229 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏడువేల మార్క్‌ను దాటింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2వేల యాక్టివ్ కేసులు ఉండగా, దాదాపు 5000 మంది వరకు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారినపడి 29 మంది మరణించినట్లుగా అక్కడి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.