Anti-Rabies Shot: వైద్య సిబ్బంది నిర్వాకం.. చదువురాని మహిళ కరోనా టీకా కోసం వెళితే.. కుక్క కాటు ఇంజక్షన్ ఇచ్చిన నర్సు
మరోసారి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. కరోనా టీకా కోసం వెళ్తే రేబిస్ ఇంజక్షన్ ఇచ్చారు వైద్య సిబ్బంది. ఇదే అంశం ఇప్పుడు స్ధానికంగా కలకలం రేపుతోంది.
Woman Given Anti-Rabies Shot Instead Of Covid Jab: మరోసారి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. కరోనా టీకా కోసం వెళ్తే రేబిస్ ఇంజక్షన్ ఇచ్చారు వైద్య సిబ్బంది. ఇదే అంశం ఇప్పుడు స్ధానికంగా కలకలం రేపుతోంది. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం బొల్లేపల్లి ప్రాథమిక పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న ప్రమీల కోవిడ్ వ్యాక్సిన్ కోసం పిహెచ్ సి కి సెంటర్‌కు వెళ్లింది. కోవిడ్ వ్యాక్సిన్‌కు బదులు రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చింది నర్సు…
నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం బొల్లేపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పుట్ట ప్రమీల పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు. ఆమెకు కోవిడ్ వ్యాక్సిన్ వేయాలని వైద్యాధికారిని కోరుతూ పాఠశాల హెడ్‌మాస్టర్ లెటర్ రాసి ఇచ్చారు. ఆ లెటర్‌ను తీసుకుని ఆమె కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. ఆసుపత్రి భవనంలో సాధారణ వైద్య టీకాలు ఇస్తుండగా, పక్కనే ఉన్న ఆయుష్ భవనంలో కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. నిరక్షరాస్యులైన ప్రమీల విషయం తెలియక నేరుగా పీహెచ్‌సీకి వెళ్లింది. కరోనా వ్యాక్సిన్ క్యూ లైన్ ఏదో తెలియక సాధారణ టీకాలు వేసే లైన్‌లో నిలబడింది.
అయితే, క్యూలైన్‌లో నిల్చున్న ఆమె ముందు అయిటిపాముల గ్రామానికి చెందిన ఓ మహిళ నిల్చొని ఉంది. ఆ మహిళకు కుక్క కరడంతో టీకా కోసం వచ్చింది. దీంతో అక్కడున్న వైద్య సిబ్బంది ఆమెకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చారు. తర్వాత ప్రమీల వంతు రాగానే కరోనా వ్యాక్సిన్ వేయాలంటూ హెడ్మాస్టర్ లెటర్ ను నర్సుకు ఇచ్చింది. కానీ, ఆ నర్సు ఆ లెటర్‌ను చదవకుండానే అదే సిరంజీతో ప్రమీలకు రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చింది.
ఒకే సిరంజీతో ఇద్దరికి ఎలా ఇస్తారని ప్రమీల ప్రశ్నించడంతో నర్సు.. అక్కడి నుంచి మెల్లగా జారుకుంది. అదే సమయంలో పక్కన ఉన్న వారు ఆ లెటర్ చదివి ఇది కరోనా లైన్ కాదని తమకు వేసింది కుక్క కాటు వ్యాక్సిన్‌గా చెప్పడంతో ప్రమీల ఆందోళనకు గురైంది. ఈ విషయంపై మండల వైద్యాధికారి కల్పనను వివరణ కోరగా ‘బాధితురాలు కరోనా టీకా బ్లాక్‌కి కాకుండా, యాంటి రేబిస్ వ్యాక్సిన్ ఇస్తున్న గదిలోకి వెళ్లారు. ఆమెకు కుక్క కరిచిందని నర్సు పొరపాటు పడింది. ఆమెకు రేబిస్ వ్యాక్సిన్ వేయలేదు. టీటీ ఇంజక్షన్ ఇచ్చామని, దీంతో ఎలాంటి ప్రమాదం ఉండదని వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించింది.
అయితే, వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి అమాయకులు ఇబ్బందుల పాలవుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. సదరు నర్సుపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.