తెలంగాణలో ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా పలు నియామక పరీక్షలు రద్దైన సంగతి తెలిసిందే. రద్దయిన పరీక్షల కొత్త తేదీలకు సంబంధించిన షెడ్యూల్‌ను టీఎస్‌పీఎస్సీ త్వరలో ప్రకటించనుంది. గ్రూప్-1 ప్రిలిమినరీని రద్దు చేసిన రోజునే పునఃపరీక్ష తేదీని జూన్ 11గా నిర్ణయించింది. రద్దైన ఇతర పరీక్షలు ఏఈఈ, డీఏవో, ఏఈ పరీక్షలతోపాటు వాయిదా పడిన టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల రాత పరీక్షలకు కొత్త తేదీలను ఖరారు చేయనుంది. కేంద్ర ప్రభుత్వ, వివిధ పోటీ పరీక్షల తేదీలను పరిశీలించి ఆయా పరీక్షలకు ఆటంకంకలగకుండా టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు అనువైన తేదీలను వారంలోగా ప్రకటించనుంది. అలాగే గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 పరీక్షలకు మధ్య వ్యవధిని పరిశీలించి, ఆ మేరకు నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. తక్కువ సంఖ్యలో అభ్యర్థులు పోటీపడుతున్న నోటిఫికేషన్ల రాతపరీక్షలను కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (సీబీఆర్‌టీ) విధానంలో నిర్వహిస్తోంది. ఫలితాలను కూడా వేగంగా వెల్లడించాలని భావిస్తోంది.
ఏప్రిల్, మే నెలల్లో జరగాల్సిన హార్టికల్చర్ అధికారులు, అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్, భూగర్భజల అధికారులు, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, పాలిటెక్నిక్ లెక్చరర్లు, లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్ల పరీక్షలను యధావిధిగా నిర్వహించాలా? లేదా అనే విషయాలను పరిశీలిస్తోంది. అవసరమైతే వారం నుంచి 15 రోజుల వ్యవధితో వీటిని రీషెడ్యూలు చేసే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ పరీక్షలన్నింటినీ సీబీఆర్‌టీ పద్ధతిలో నిర్వహించాలని కమిషన్ యోచిస్తోంది. ఏఈఈ పోస్టులకు 81 వేల మంది, ఏఈ పోస్టులకు 74 వేల మంది దరఖాస్తు చేశారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈ పోస్టుల్లో వివిధ కేటగిరీలు ఉన్నందున, ఆయా విభాగాల వారీగా సీబీఆర్‌టీ విధానంలోనే పరీక్షలు నిర్వహించాలని కమిషన్ భావిస్తోంది. భద్రతను మరింత పటిష్టం చేసే విషయాలపై సైబర్ సెక్యూరిటీ నుంచి సూచనలు తీసుకుంటోంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.