హైదరాబాద్, డిసెంబర్ 26: తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్ధుల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ పరీక్షలు ఈ సారైనా జరుగుతాయో లేదోనని సందిగ్ధంలో ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం గ్రూప్ 2 పరీక్షలు జనవరి 6, 7 తేదీల్లో నిర్వహిస్తామంటూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) రెండు నెలల క్రితమే ప్రకటించింది. తాజాగా గ్రూప్- 2 పరీక్ష మళ్లీ వాయిదా పడినట్లు సమాచారం అందుతోంది. వాస్తవానికి ఈ ఏడాది నవంబర్ 2, 3 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్పీయస్సీ తేదీలు ప్రకటించినప్పటికీ పరీక్షల సన్నద్ధతకు మరింత సమయం ఇవ్వాలంటూ అభ్యర్థులు విజ్ఞప్తి చేసుకున్నారు. ఇంతలో ఎన్నికల షెడ్యూల్ వెలువడటం, పోలీసులు ఎన్నికల విధుల్లో ఉండటంతో 2024 జనవరిలో పరీక్షలు నిర్వహిస్తామని కమిషన్ ప్రకటించింది.
అయితే మరో 10 రోజుల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిసన్ పరీక్షల ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. పైగా ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్ సహా ఐదుగురు సభ్యులు రాజీనామా చేశారు. ఈ రాజీనామా లేఖలన్నీ గవర్నర్ కార్యాలయానికి పంపారు. అయితే రాజీనామాలు పంపి వారం దాటినా గవర్నర్ కార్యాలయం నుంచి వాటిని ఆమోదిస్తున్నట్లుగానీ.. తిరస్కరిస్తున్నట్లుగానీ ఎలాంటి సమాచారం అందలేదు. వారి రాజీనామాలను గవర్నర్ ఆమోదిస్తే తప్ప కొత్తగా చైర్మన్‌ను, సభ్యులను నియమించే అవకాశం లేదని అంటున్నారు. పరీక్షల నిర్వహణ, నియామకాలకు సంబంధించిన అంశాల్లో చైర్మన్, సభ్యులు కీలకం. వారి నియామకాలు పూర్తయితే తప్ప గ్రూప్ 2 పరీక్షకు మార్గం సుగమమంకాదు. దీంతో జనవరిలో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ కష్టమేనని సమాచారం.
రాష్ట్రంలోని వివిధ శాఖల్లో 783 గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్‌లో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 5 లక్షల 50 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్ 2 అర్హత పరీక్షలను ఈ ఏడాది ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించనున్నట్లు కమిషన్ తొలుత ప్రకటించగా.. ఆ తర్వాత ఈ తేదీలను నవంబర్ 2, 3 తేదీలకు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత మళ్లీ జనవరి 6, 7 తేదీలకు వాయాదా పడింది. ఇప్పుడు మళ్లీ వాయిదా పడే అవకాశం కనిపించడంతో గ్రూప్ -2 ఎగ్జామ్ డేట్ రీ షెడ్యూల్ చేస్తారా లేక కొత్త పోస్టులను చేర్చి రీ వైజ్డ్ నోటిఫికేషన్ ఇస్తారా అనేదానిపై కమిషన్ క్లారిటీ ఇవ్వలేదు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.