హైదరాబాద్, ఫిబ్రవరి 19: టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన డ్రగ్ ఇన్‌స్పెక్టర్ రాత పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 16న విడుదలైన సంగతి తెలిసిందే. డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. వీరందరికి టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం 10.30 నుంచి ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేయనున్నట్లు తెలిపింది. ఎంపికైన అభ్యర్థుల వివరాలు, చెక్‌లిస్ట్ వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు ఓ ప్రకటనలో వివరించింది.
కరీంనగర్‌లో టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలను ఫిబ్రవరి 24 నుంచి నిర్వహించన్తున్నట్లు డీఈవో జనార్దన్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు. డ్రాయింగ్ లోయర్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి జరుగుతాయని, టైలరింగ్ లోయర్ హయ్యర్ గ్రేడ్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు.
దేశ వ్యాప్తంగా ఉన్న పలు ఐఐటీలతో సహా ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) 2024 ఫలితాలు మార్చి 16న విడుదల కానున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో దేశంలోని 200 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫలితాలు విడుదలైన తర్వాత పరీక్షకు హాజరైన అభ్యర్ధులు తమ వివరాలు నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్‌లో గేట్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు. గేట్ స్కోర్ ఆధారంగా జాతీయస్థాయిలోని విద్యాసంస్థలే కాకుండా పలు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు కూడా ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి. బెంగళూరు ఐఐఎస్సీ ఈ ఏడాది గేట్ పరీక్ష బాధ్యతలు నిర్వహిస్తోందన్న సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్‌లో 2024-2025 విద్యా సంవత్సరానికి గానూ ప్రైవేటు, అన్ ఎయిడెడ్ స్కూళ్లలో ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలకు సంబంధించి పాఠశాల విద్య శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనాథ, హెచ్‌ఐవీ బాధితులు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ కేటగిరీలకు చెందిన విద్యార్థులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా పేర్కొంది. అర్హులైన విద్యార్థులు పాఠశాల విద్య శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొంది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14వ తేదీ వరకూ ఆన్‌లైన్ దరఖాస్తులకు అవకాశం కల్పించింది. ఏప్రిల్ 1వ తేదీన మొదటి విడత, ఏప్రిల్ 15న రెండో విడత ఫలితాలు ప్రకటిస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.