
హైదరాబాద్, ఆగస్టు 1: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రవేశాల గడువు గతంలో జులై 25తో ముగియగా ఇంటర్ బోర్డు జులై 31వ తేదీ వరకు పొడిగించింది. ఆ తర్వాత ఆగస్టు 5 వరకు గడువు పొడిగించింది. తాజాగా మరోమారు ప్రవేశాల గడువు పొడిగిస్తూ ఇంటర్ బోర్డు ప్రకటన వెలువరించింది. ఈ మేరకు ఆగస్టు 5 వరకు ఉన్న గడువును ఆగస్టు 16వ తేదీ వరకూ పొడిగిస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ ప్రకటన వెలువరించారు.
గడువు తేదీ తర్వాత ప్రైవేటు కాలేజీల్లో చేరితే ఆలస్య రుసుం చెల్లించాలని తెల్పింది. ప్రభుత్వ కళాశాలల్లో చేరే వారికి మాత్రం ఆలస్య రుసుం చెల్లింపు ఉండదని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ప్రవేశాలు పొందని విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని బోర్డు సూచించింది. గడువు తేదీలోగా కాలేజీలో చేరాలని స్పష్టం చేసింది. కాలేజీల జాబితా ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. ప్రవేశాల ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంతో ఈ మేరకు గడువును పొడుగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు వివరించింది. కాగా పదో తరగతి పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తోన్న సంగతి తెలిసిందే.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.