హైదరాబాద్, మే 29: తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దోస్త్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఇప్పటికే ప్రారంభమైంది. మొత్తం మూడు విడతల్లో డిగ్రీ ప్రవేశాలు జరగనున్నాయి. వేల మంది విద్యార్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటున్నారు. మరోవైపు విద్యార్ధుల సౌకర్యార్థం శాతవాహన యూనివర్సిటీ పలు కాలేజీల్లో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. డిగ్రీ అనంతరం తక్షణం ఉపాధి పొందవచ్చనే నమ్మకంతో అధిక మంది విద్యార్ధులు బీకామ్, బీఎస్సీ వంటి పలు కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ యూనివర్సిటీ పరిధిలో 16 ప్రభుత్వ, 86 ప్రైవేటు డిగ్రీ కాలేజీలు ఉండగా.. వీటిల్లో అన్ని గ్రూపుల్లో కలిపి మొత్తం 25 వేల పైచిలుకు సీట్లు అందుబాటులో ఉన్నాయి.
శాతవాహన యూనివర్సిటీ పరిధిలో వివిధ కాలేజీల్లో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాల్లో నేరుగా కలిసిగానీ లేదంటే ఫోన్ చేసిగానీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. సహాయక కేంద్రాల్లో సిబ్బంది విద్యార్థులకు అవసరమైన సమాచారం అందిచడమేకాకుండా వారి సందేహాలను కూడా నివృతి చేస్తారు. శాతవాహన యూనివర్సిటీ హెల్ప్ లైన్ నంబర్ 90304 02257, ఎస్సారార్ కాలేజీ 94906 83621 నంబర్లకు ఫోన్ చేసి విద్యార్ధులు తమ సందేహాలు నివృతి చేసుకోవచ్చని దోస్త్ కోఆర్డినేటర్లు ఈ సందర్భంగా సూచిస్తున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.