AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGPSC Group 1 Jobs: అన్నంత పని చేసిన టీజీపీఎస్సీ.. గ్రూప్‌ 1పై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో పిటీషన్‌!

గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు దాఖలైన పిటిషన్లపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గ్రూప్‌ 1 మెయిన్స్‌ ఫలితాలను రద్దు చేయాలని, చేయవద్దని కోరుతూ దాఖలైన మొత్తం 12 పిటిషన్లపై జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదప్రతివాదనలు విన్న ధర్మాసనం 222 పేజీల తీర్పు..

TGPSC Group 1 Jobs: అన్నంత పని చేసిన టీజీపీఎస్సీ.. గ్రూప్‌ 1పై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో పిటీషన్‌!
TGPSC Moves Division Bench on Group 1
Srilakshmi C
|

Updated on: Sep 17, 2025 | 4:01 PM

Share

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రూప్‌ 1 నియామక ప్రక్రియ రోజుకో మలుపు తిరుగుతుంది. గ్రూప్ 1 అంశంపై హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను టీజీపీఎస్సీ ఆశ్రయించింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి మార్చి 10న విడుదల చేసిన ఫలితాలను, మార్చి 30న ప్రకటించిన జనరల్ ర్యాంకులను హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేస్తూ సెప్టెంబర్‌ 9న సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. తీర్పు సందర్భంగా టీజీపీఎస్సీకి కోర్టు 2 ఆప్షన్లను ఇచ్చింది. మెయిన్స్‌ జవాబు పత్రాలను పునఃమూల్యాంకనం చేయాలి. ఆ ఫలితాల ఆధారంగా 563 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది. లేదంటే 2024 అక్టోబరు 21 నుంచి 27 మధ్య జరిగిన మెయిన్స్‌ పరీక్షలను రద్దు చేసి, ఆ పరీక్షలను తిరిగి నిర్వహించాలి. ఈ ప్రక్రియను 8 నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టంచేసింది. ఈక్రమంలో సింగిల్‌ బెంచ్‌ తీర్పును సవాల్‌ చేస్తూ టీజీపీఎస్సీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది.

కాగా గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు దాఖలైన పిటిషన్లపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గ్రూప్‌ 1 మెయిన్స్‌ ఫలితాలను రద్దు చేయాలని, చేయవద్దని కోరుతూ దాఖలైన మొత్తం 12 పిటిషన్లపై జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదప్రతివాదనలు విన్న ధర్మాసనం 222 పేజీల తీర్పును వెలువరించింది. టీజీపీఎస్సీ పక్షపాతంతో వ్యవహరించి ఉద్యోగ నియామక నియమాలను టీజీపీఎస్సీ ఉల్లంఘించినట్లు కోర్టు తేల్చింది. ఈ కారణాల వల్ల గ్రూప్‌ 1 జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. సంజయ్‌ సింగ్‌ వర్సెస్‌ యూపీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు మేరకు మాడరేషన్‌ పద్ధతిని వర్తింపజేయడం ద్వారా గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షల సమాధాన పత్రాలను మాన్యువల్‌గా తిరిగి మూల్యాంకనం చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. పునఃమూల్యాంకనం చేయలేని పక్షంలో 8 నెలల్లోపు గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షను తిరిగి నిర్వహించాలని పేర్కొంది.

నిజానికి.. నిబంధనల ప్రకారం మూల్యాంకనానికి రెగ్యులర్‌ సిబ్బందినే వినియోగించాల్సి ఉండగా, రిటైర్డ్‌ అయిన వాళ్లతో చేయించడాన్ని హైకోర్టు నిలదీసింది. నిబంధనల ప్రకారం 2 సార్లు పేపర్లు మూల్యాంకనం చేయాలి. కానీ అలా చేయకుండా మెయిన్స్‌ పరీక్షలకు కీ, ఆధారాలు చూపలేమని కమిషన్‌ విడ్డూరంగా సమాధానం చెప్పింది. పైగా రెండు కేంద్రాల్లో పరీక్షలు రాసిన పలువురికి ఒకేరకమైన మార్కులు రావడంపై కూడా కోర్టు తప్పుబట్టింది. మహిళా అభ్యర్థులను 28 కేంద్రాలు కేటాయించగా.. ఒక్క కోఠి ఉమెన్స్‌ కాలేజీలో 2 సెంటర్లలో మాత్రమే 71 మంది ఎంపికవడం కొసమెరుపు. మిగిలిన 26 పరీక్షా కేంద్రాలో కేవలం 139 మంది మాత్రమే ఎంపికయ్యారు. ఇర ఇంగ్లిష్‌ మీడియంలో 12,381 మంది పరీక్ష రాయగా వారిలో 506 మంది ఎంపికయ్యారు. తెలుగు మీడియంలో 8,694 మంది రాస్తే.. కేవలం 56 మందే ఎంపికవడం. ఉర్దూలో 10 మందికి ఒకరు ఎంపికవడంపై కూడా ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది. ఈ కారణాల వల్ల గ్రూప్‌ 1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ చేపట్టిన ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు కోర్టు తేల్చింది. అయితే కమిషన్‌ మాత్రం తన చర్యను సమర్దించుకుంటూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ చేయడం గమనార్హం.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.