TG EAPCET 2026 Exams: మరో 2 రోజుల్లోనే ఈఏపీసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు.. ఈ రూల్స్ మస్ట్‌గా తెలుసుకోండి
రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్) మే 4 నుంచి మొదలైన సంగతి తెలిసిందే. ఇందులో అగ్రికల్చర్, ఫార్మా విభాగం పరీక్షలు తాజాగా ముగిశాయి. రోజుకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరిగాయి. మొత్తం 90,977 మంది దరఖాస్తు చేసుకోగా, 84,954 మంది అంటే 93.38 శాతం మంది ఈ పరీక్షలకు హాజరైనట్లు కన్వీనర్ ఆచార్య కె.విజయకుమార్ రెడ్డి తెలిపారు..

హైదరాబాద్, మే 7: రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్) మే 4 నుంచి మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే అగ్రికల్చర్ పరీక్షలు ముగియగా.. మే 9 నుంచి 11వ తేదీ వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు మొత్తం 125 పరీక్ష కేంద్రాల్లో జరగనున్నాయి. ఈ పరీక్షలు కూడా రోజుకు రెండు సెషన్లలో జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఒక సెషన్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరో సెషన్ ఉంటుంది. ఉదయం సెషన్‌లో 7.30 గంటలకు, సాయంత్రం సెషన్‌లో మధ్యాహ్నం 1.30 గంటలకే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవల్సి ఉంటుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
తెలంగాణ ఈఏపీసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ హాల్ టికెట్ల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇప్పటికే విద్యార్ధులందరికీ హాల్ టికెట్లను కూడా జారీ చేశారు. ఈఏపీసెట్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,01,194 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు 2,10,308 మంది, అగ్రికల్చర్, ఫార్మసీకి 90,569 మంది దరఖాస్తు చేసుకున్నారు. శనివారం నుంచి మొదలయ్యే ఇంజనీరింగ్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సెట్ కన్వీనర్ డాక్టర్ కె విజయకుమార్ రెడ్డి తెలిపారు.
పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించే విద్యార్థులందరికీ బయో మెట్రిక్ అటెండెన్స్ ఉంటుంది. కుడిచేతి బొటన వేలి ముద్ర తీసుకుంటారు. అందువల్ల విద్యార్ధులు తమ చేతులకు టాటూలు, మెహిందీలు, ఇంక్ ముద్రలు పెట్టుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇవి ఉంటే పరీక్ష కేంద్రానికి అనుమతించరు. బ్లాక్ లేదా బ్లూ పెన్, హాల్ టికెట్, ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డును మాత్రమే పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు. క్యాలిక్యులేటర్, మేథమెటికల్, లాగ్ టేబుల్స్, సెల్‌ఫోన్లు, వాచ్ వంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులను ఎట్టిపరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. వీటితోపాటు హాల్ టికెట్లపై సూచించిన ఇతర నిబంధనలను కూడా విద్యార్ధులు అనుసరించవల్సి ఉంటుంది. పరీక్ష ముగిసిన వెంటనే అభ్యర్థులు తమ మార్కులను కంప్యూటర్ స్క్రీన్‌పై చూడొచ్చు. అయితే తుది కీ, నార్మలైజేషన్ తర్వాత మాత్రమే ఫైనల్ ర్యాంకులను కేటాయిస్తారు.
తెలంగాణ ఈఏపీసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ హాల్ టికెట్ల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




