TG DSC 2024 Result Date: ప్రశాంతంగా ముగిసిన డీఎస్సీ పరీక్షలు.. ఫలితాలు ఎప్పుడంటే?

|

Aug 07, 2024 | 6:53 AM

తెలంగాణ రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షలు సోమవారంతో ముగిసిన సంగతి తెలిసిందే. 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 2,79,957 దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 87.61 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అంటే 2,45,263 మంది పరీక్షకు హాజరయ్యారు..

TG DSC 2024 Result Date: ప్రశాంతంగా ముగిసిన డీఎస్సీ పరీక్షలు.. ఫలితాలు ఎప్పుడంటే?
TG DSC 2024 Result Date
Follow us on

హైదరాబాద్‌, ఆగస్టు 7: తెలంగాణ రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షలు సోమవారంతో ముగిసిన సంగతి తెలిసిందే. 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 2,79,957 దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 87.61 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అంటే 2,45,263 మంది పరీక్షకు హాజరయ్యారు. దాదాపు 34,694 మంది అభ్యర్ధులు పరీక్షలు రాయలేదు. అత్యధికంగా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పోస్టులకు 92.10 శాతం మంది అభ్యర్ధులు హాజరైనట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు త్వరలోనే విడుదలకానున్నాయి. తొలుత ఆన్సర్‌ కీ విడుదల చేసి, దానిపై అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం ఫైనల్‌ ఆన్సర్‌ కీ రూపొందిస్తారు. అనంతరం ఫలితాలు వెలువరిస్తారు. సెప్టెంబరు 5 నాటికి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఎంపికైన అభ్యర్ధులందరికీ నియామక పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్న 11,062 ఖాళీల్లో 2,629 స్కూల్‌ అసిస్టెంట్ పోస్టులు, ఎస్జీటీలు 6,508 పోస్టులు, భాషా పండితులు 727 పోస్టులు, పీఈటీలు 182 పోస్టులు, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్‌ 220 పోస్టులు, ఎస్జీటీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) 796 పోస్టులు ఉన్నాయి. ఇక స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు అత్యధికంగా 1,61,745 మంది దరఖాస్తు చేసుకోగా.. ఎస్జీటీకి 88,005 మంది, భాషా పండితులు 18,211 మంది, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుకు 11,996 మంది దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో ఏప్రిల్​4వ తేదీతో డీఎస్సీ దరఖాస్తు గడువు ముగిసింది. అయితే డీఎస్సీకి ముందే టెట్ మరోమారు నిర్వహించాలన్న నిరుద్యోగుల డిమాండ్‌ మేరకు తెలంగాణ ప్రభుత్వం జూన్ 20 వరకు దరఖాస్తుల గడువు పొడిగించింది.

తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు జూలై 17 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. అభ్యర్థుల డిమాండ్ మేరకు జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు నిర్వహించేందుకు కొత్త షెడ్యూల్‌ను రూపొందించింది. అయితే సన్నద్ధతకు మరింత సమయం కావాలని, ఈ తేదీలను కూడా వాయిదా వేయాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఆందోళనలు చేపట్టినప్పటికీ.. వీటి నడుమ విజయవంతంగా విద్యాశాఖ డీఎస్సీ పరీక్షలు పూర్తి చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.