TS Anganwadi Jobs: తెలంగాణలో ముగిసిన అంగన్‌వాడీ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీ ప్రక్రియ.. ఏపీలో తెమిలేదెప్పుడో..?
తెలంగాణలో 426 అంగన్‌వాడీ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసినట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ వెల్లడించింది. న్యాయవివాదాలు పరిష్కారమవడంతో ఎంపికైన అభ్యర్థులకు..
తెలంగాణలో 426 అంగన్‌వాడీ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసినట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ వెల్లడించింది. న్యాయవివాదాలు పరిష్కారమవడంతో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేసినట్లు తాజాగా వెల్లడించింది. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లలో అర్హత కలిగిన వారికి సూపర్‌వైజర్ గ్రేడ్-2గా పదోన్నతులను ఈ నోటిఫికేషన్ ద్వారా కల్పించింది. ఇందుకుగాను ప్రభుత్వం గతేడాది (2021) నవంబరులో 426 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఈ ఏడాది జనవరి 2న రాతపరీక్ష నిర్వహించగా 16,815 మంది అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు హాజరయ్యారు. అనంతరం శిశు సంక్షేమ శాఖ ఫలితాలు వెల్లడించింది. మెరిట్ ప్రాతిపదికన 1 : 2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టారు.
ఐతే కొందరు ఈ నియామక విధానంపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీనితో నియామక ప్రక్రియ నిలిచిపోయింది. ఇటీవల హైకోర్టు న్యాయవివాదాలను పరిష్కరించడంతో అన్ని అడ్డంకులు తొలగిపోయి, మార్గం సుగమమైంది. నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని ఏడు జోన్లలో అభ్యర్థులను ఎంపిక చేసిన అధికారులు, నవంబరు 27న అపాయింట్‌మెంట్ ఆర్డర్లను అందించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న ప్రక్రియ..
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకూడా 560 అంగన్వాడీ సూపర్‌వైజర్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి ఇటీవలే హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొత్తం 50 మార్కులకుగానూ 45 మార్కులకు నిర్వహించిన రాత పరీక్షకు 21,000ల మంది హాజరయ్యారు. మిగిలిన 5 మార్కులకు స్పోకెన్ ఇంగ్లీష్ టెస్ట్ నిర్వహించారు. మెరిట్ ప్రాతిపదికన 1 : 2 నిష్పత్తిలో 1,194 మందిని స్పోకెన్ ఇంగ్లిష్ టెస్టుకు ఎంపిక చేసి, 3 నుంచి 5 నిముషాల నిడివితో స్పోకెన్ ఇంగ్లిష్ వీడియోలు రికార్డు చేశారు. ఐతే ఆ తర్వాత ఇంతమంది వీడియోలు చూడటం కష్టమని భావించి మెరిట్ లిస్ట్‌లో ఉన్నవారిని మాత్రమే స్పోకెన్ ఇంగ్లీష్ విడియోలు అప్‌లోడ్ చేయాలని సూచించడంతో అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఫలితాల ప్రకటన నిలిచిపోయింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు తాజాగా స్టేను ఎత్తివేసింది. త్వరలోనే ఫలితాల విడుదలవ్వనున్నాయి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.