ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను ఏటా ఒకసారి తప్పకుండా నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదించింది. గతేడాది జూన్ 12న టెట్ నిర్వహించామని, ఏడాది కావొస్తుండగా మరోమారు ఈ పరీక్ష నిర్వహించాలని తెల్పింది. ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం డీఎడ్, బీఎడ్ పాసైన వారు టెట్‌లో ఉత్తీర్ణులైతేనే టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ) రాయడానికి అర్హులవుతారు. టెట్‌లో వచ్చిన మార్కులకు ఉపాధ్యాయ నియామక పరీక్షలో (టీఆర్టీ) ర్యాంకింగ్‌లో 20 శాతం వెయిటేజీ కల్పిస్తారు. ప్రతీయేట 20ల మంది డీఈడీ, బీఈడీ ఉత్తీర్ణులై బయటికి వస్తున్నారు. అందువల్ల టెట్‌లో అత్యధిక మార్కులు దక్కించుకోవడానికి అభ్యర్థులు పోటీపడుతుంటారు. మార్కులు పెంచుకునేందుకు పరీక్షకు మళ్లీ మళ్లీ హాజరవుతుంటారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 2016 మే 22, 2017 జులై 23, 2022 జూన్ 12నలలో మొత్తం మూడుసార్లు టెట్ పరీక్ష నిర్వహించారు. మరో నెలలో ఏడాది ముగుస్తున్నందువల్ల మళ్లీ టెట్ జరపాల్సి ఉంది. ఈ మేరకు అనుమతి కోరుతూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
టెట్‌లో ఇప్పటివరకు మొత్తం 4 లక్షల మంది పాసవగా.. ఇంకా 2.50 లక్షల మంది డీఎడ్, బీఈడీ పూర్తయిన వారు ఉత్తీర్ణులయ్యేందుకు పరీక్షలు రాస్తూనే ఉన్నారు. మరోవైపు మార్కులు మెరుగుపరుచుకునేందుకు పాసైనవారూ మళ్లీ రాస్తూనే ఉన్నారు. గత ఏడాది పరీక్షకు 3.50 లక్షల మంది హాజరయ్యారు. మళ్లీ జరిపినా కనీసం 3 లక్షల దరఖాస్తులకు తగ్గవని అంచనా. కాగా గతేడాది టెట్ నిర్వహించిన వెంటనే టీఆర్‌టీ నోటిఫికేషన్ ఆస్తామన్న విద్యాశాఖ, ఇప్పటికి ఏడాది గడుస్తున్నా టీఆర్‌టీ నోటిఫికేషన్ ఇంకా వెలువరించలేదు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.