TGSRTC Jobs: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 1,500 ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్.. పరీక్ష లేకుండానే జాబ్!
Telangana RTC Jobs 2026: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం 1,500 ఆర్టీసీ కండక్టర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టెన్త్ మార్కుల ఆధారంగా ఎంపిక చేపట్టనున్నట్లు సమాచారం. గ్రేడింగ్ విధానంపై స్పష్టత వచ్చిన వెంటనే అధికారిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.

TGSRTC Conductor Recruitment: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రవ్యాప్తంగా 1,500 ఆర్టీసీ కండక్టర్ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నియామక ప్రక్రియను తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC) స్వయంగా నిర్వహించనుంది. ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంతో నియామకాలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
టెన్త్ మార్కుల ఆధారంగానే ఎంపిక
ఈ కండక్టర్ పోస్టులకు అభ్యర్థుల ఎంపికను 10వ తరగతి మార్కుల ఆధారంగా చేపట్టే అవకాశముందని సమాచారం. గతంలో కూడా ఆర్టీసీ ఇదే విధానాన్ని అనుసరించింది. అయితే మధ్యలో ఎస్సెస్సీ పరీక్షల్లో గ్రేడింగ్ విధానం అమల్లోకి రావడంతో ప్రస్తుతం ఒకే నియామక ప్రక్రియలో కొంతమంది అభ్యర్థులకు మార్కులు, మరికొందరికి గ్రేడ్ పాయింట్లు ఉండే పరిస్థితి ఏర్పడింది. దీంతో గ్రేడ్ పాయింట్లను మార్కుల శాతంగా ఎలా పరిగణించాలనే అంశంపై ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఎస్సెస్సీ బోర్డుకు ఇప్పటికే లేఖ పంపినట్లు సమాచారం. బోర్డు నుంచి స్పష్టత వచ్చిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసే దిశగా చర్యలు తీసుకోనున్నారు.
దశాబ్దం తర్వాత భారీ నియామకాలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీజీఎస్‌ఆర్టీసీలో ఇప్పటి వరకు రెగ్యులర్ కండక్టర్ పోస్టుల భర్తీ జరగలేదు. ఈ మధ్యకాలంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పదవీ విరమణ చేయడంతో ఖాళీలు పెరిగిపోయాయి. తాత్కాలికంగా ఔట్‌సోర్సింగ్ విధానంలో కొంతమందిని నియమించినప్పటికీ శాశ్వత నియామకాల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో దాదాపు పదేళ్ల తర్వాత భారీ స్థాయిలో కండక్టర్ పోస్టుల భర్తీ జరగబోతోంది.
ఆర్టీసీలో తీవ్ర సిబ్బంది కొరత
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీలో 2,000కు పైగా కండక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇటీవల కొత్త బస్సులు కూడా సేవల్లోకి రావడంతో సిబ్బంది అవసరం మరింత పెరిగింది. మొత్తం మీద 3 వేలకుపైగా కండక్టర్ల అవసరం ఉందని ఆర్టీసీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో మొదటి దశలో 1,500 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సిబ్బంది కొరత కొంత మేర తగ్గే అవకాశం ఉంది.
డబుల్ డ్యూటీలతో కొనసాగుతున్న సేవలు
కండక్టర్ల కొరత కారణంగా ప్రస్తుతం అనేక డిపోల్లో ఉన్న ఉద్యోగులతోనే డబుల్ డ్యూటీలు చేయిస్తున్నారు. కొన్ని దూరప్రాంత సర్వీసుల్లో డ్రైవర్లే టికెట్లు జారీ చేసే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అదనంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతో సేవలను కొనసాగిస్తున్నారు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా రెగ్యులర్ నియామకాలను చేపట్టాలని ఆర్టీసీ చాలా కాలంగా ప్రభుత్వాన్ని కోరుతోంది.
త్వరలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం
ఎస్సెస్సీ బోర్డు నుంచి గ్రేడింగ్ విధానంపై స్పష్టత వచ్చిన వెంటనే ఖాళీల వివరాలు, అర్హతలు, రిజర్వేషన్, దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి పూర్తి వివరాలతో అధికారిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఆర్టీసీ నుంచి వచ్చే అధికారిక ప్రకటనపై దృష్టి ఉంచాలని అధికారులు సూచిస్తున్నారు.




