హైదరాబాద్, జనవరి 6: తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్తులో విద్యుత్తు అవసరాలను తీర్చేందుకు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025ను ప్రకటించింది. పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి, సమన్వయ అభివృద్ధి లక్ష్యంతో రూపొందించిన ఈ విధానం 2030 నాటికి 20 వేల మెగావాట్ల అదనపు పునరుత్పాదక విద్యుత్తు సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు రాబోయే 10 ఏళ్లలో రూ.1.98 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.14 లక్షల కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టించనుంది. కాలుష్య కారక తీవ్రతను 33% తగ్గించడమే ఈ విధానం లక్ష్యం.
ప్రభుత్వం చేపడుతున్న మెట్రో విస్తరణ, ఫార్మాసిటీ, ఏఐ సిటీ, రీజినల్ రింగ్ రోడ్డు వంటి పెద్ద ప్రాజెక్టులతో విద్యుత్తు డిమాండ్ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. 2024-25లో గరిష్ట డిమాండ్ 15,623 మెగావాట్లుగా ఉండగా, 2034-35 నాటికి ఇది 31,809 మెగావాట్లకు చేరనుంది.
తెలంగాణలో గల అనుకూల వాతావరణ పరిస్థితులు సౌర, పవన విద్యుత్తు ఉత్పత్తికి పెద్దగా సహకరిస్తాయి. 300 రోజులు సౌర విద్యుత్తు అందుబాటులో ఉండే రాష్ట్రం, గాలులు బలంగా వీచే 8 రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ పాలసీ ద్వారా తెలంగాణ గ్రీన్ ఎనర్జీ సెక్టార్‌లో దేశవ్యాప్తంగా కీలక ప్రదేశంగా మారనుంది. సమన్వయ అభివృద్ధి లక్ష్యంతో పాటు పర్యావరణ రక్షణకు దోహదపడే ఈ విధానం రాష్ట్రాన్ని ఒక నూతన శక్తి కేంద్రంగా మార్చనుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.