
హైదరాబాద్, డిసెంబర్ 12: తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (జెన్‌కో)లో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ నియామక రాత పరీక్షలు వాయిదా పడ్డాయి. డిసెంబర్ 17న నిర్వహించాల్సిన జెన్కో ఏఈ రాత పరీక్షలు వాయిదా వేసినట్లు ప్రభుత్వం ప్రకటన వెలువరించింది. అదే రోజున కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల పోటీ పరీక్షలు ఉన్నందున్న జెన్కో ఏఈ పరీక్షను వాయిదా వేయాలని నిరుద్యోగులు సోమవారం (డిసెంబర్ 11) సీఎం రేవంత్‌ని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రటకనలో వెలువరించింది. సీఎం సూచన మేరకు ఏఈ పరీక్షలు జెన్‌కో వాయిదా వేసింది. తదుపరి షెడ్యూల్‌ను ఎప్పుడనేది తెలంగాణ జెన్కో వెబ్‌సైట్‌లో త్వరలో పొందు పరుస్తామని ప్రకటనలో వివరించింది.
కాగా మొత్తం 339 అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ సివిల్), 60 కెమిస్ట్ పోస్టులను ప్రత్యక్ష, రెగ్యులర్ నియామకాల పద్ధతిలో భర్తీ చేసేందుకు హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ అక్టోబర్ 4వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఈ నెల 17వ తేదీన ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే రాత పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు (డిసెంబర్ 8) విడుదలయ్యాయి కూడా. పరీక్ష కేంద్రాలను హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ఏర్పాటు చేసింది. అయితే ఇతర సంస్థలు, ప్రభుత్వ పోటీ పరీక్షలు ఉన్నందున జెన్‌కో రాత పరీక్షను వాయిదా వేస్తూ ప్రభుత్వం ప్రటకన విడుదల చేసింది. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్వహణతో పాటు ఇప్పటికే ఉన్న పాత విద్యుత్ కేంద్రాల అవసరాల కోసం ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్టు జెన్‌కో సంస్థ ఇప్పటికే స్పష్ట చేసింది.
TSGENCO JE Postponed
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.