Scholarship: స్కాలర్‌షిప్ రూల్స్ మారాయోచ్.. ఇకపై పదో తరగతి మెమో, ఆధార్‌లోని పేరు ఒకేలా ఉండాలి!
రాష్ట్రంలోని పేద విద్యార్ధులకు అందించే స్కాలర్ షిప్ రూల్స్ మారాయి. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను ఎస్సీ సంక్షేమ శాఖ విడుదల చేసింది. తాజా నిబంధనల ప్రకారం ఇకపై పదో తరగతి మార్కుల మెమోపై, ఆధార్ కార్డుపై ఉన్న పేర్లు ఒకేలా ఉండాలని సూచించింది. ఒకవేళ ఎవరికైనా పేర్లు మార్పుగా ఉంటే వెంటనే మార్చుకోవాలని సూచించింది..
హైదరాబాద్, జనవరి 13: తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ విద్యార్థులు ఉపకారవేతనాలు అందించేందుకు ఎస్సీ సంక్షేమ శాఖ మరో కొత్త కొర్రీ విధించింది. పదో తరగతి ఎస్సెస్సీ మార్కుల మెమో, ఆధార్ కార్డులోని పేరు రెండూ ఒకేలా ఉండాలని, ఒకే విధంగా సరిపోలాలని ఎస్సీ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా పలు సూచనలు జారీ చేసింది. ఎస్సీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ నూతన మార్గదర్శకాల ప్రకారం 2024-25 విద్యాసంవత్సరం నుంచి ఉపకారవేతనాలను మంజూరు చేయనున్నాని, ఆయ మార్గదర్శకాలను ఈ-పాస్ వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు వెల్లడించింది. ముఖ్యంగా ఈ సారి నుంచి పదో తరగతి మెమో ప్రకారం ఆధార్ కార్డులోని పేరు సరిపోలేలా చూసుకోవాలని సూచించింది. ఒకవేళ లేకుంటే మెమోలో మాదిరిగా సవరించుకోవాలని పేర్కొంది. ప్రాథమిక దరఖాస్తు అనంతరం మీసేవ కేంద్రాల్లో విద్యార్థులు బయోమెట్రిక్‌ను ధ్రువీకరించుకోవాలి. అనంతరం తుది దరఖాస్తు ఈ-పాస్ వెబ్‌సైట్లో పూర్తిచేయాల్సి ఉంటుందని చెప్పింది. ఆనక కళాశాలల యాజమాన్యాలు ఈ దరఖాస్తులను పరిశీలించి జిల్లా అధికారులకు డిజిటల్ కీ ద్వారా ఆన్‌లైన్లో పంపించాలి. అలాగే విద్యార్థులు తమ బ్యాంకు ఖాతాలకు ఆధార్ సీడింగ్ పూర్తిచేయాలని సంక్షేమ శాఖ తన మార్గదర్శాల్లో సూచించింది.
తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో మ్యూజిక్ టీచర్ల ప్రాథమిక ఎంపిక జాబితా వెల్లడి
తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో మ్యూజిక్ టీచర్ల ప్రాథమిక ఎంపిక జాబితాను గురుకుల నియామక బోర్డు ఛైర్మన్ సైదులు తాజాగా వెల్లడించారు. ఈ జాబితాను గురుకుల నియామక బోర్డు వెబ్‌సైట్లో పొందుపరిచామని, అభ్యర్ధులు వెబ్‌సైట్ నుంచి డైరెక్టుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ పోస్టులకు మొత్తం 96 మంది ఎంపికయ్యారని, వారందరికీ ఆయా గురుకుల సొసైటీలు ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి.. అనంతరం నియామక పత్రాలు అందజేస్తామన్నారు.
తెలంగాణ ఎన్‌ఎంఎంఎస్‌ఎస్ పరీక్ష తుది ‘కీ’ విడుదల
తెలంగాణ రాష్ట్రస్థాయిలో గత ఏడాది నవంబరు 24న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ (ఎన్‌ఎంఎంఎస్‌ఎస్) పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన తుది ‘కీ’ని వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు ఓ ప్రకటనలో తెలిపారు. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఈ పరీక్ష జరుపుతారు. వచ్చే 2 నెలల్లో జిల్లాలు, సామాజికవర్గాల వారీగా ఎంపికైన వారి జాబితా విడుదల చేయనున్నారు. ఎన్‌ఎంఎంఎస్‌ఎస్ పరీక్షలో మెరిట్ సాధించిన విద్యార్ధులకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఇంటర్ వరకు స్కాలర్‌షిప్ అందజేస్తారు.
ఎన్‌ఎంఎంఎస్‌ఎస్ పరీక్ష తుది ‘కీ’ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.