రాయ్‌పూర్, ఫిబ్రవరి 20: 10, 12 తరగతుల విద్యార్థులు యేటా రెండు సార్లు బోర్డు పరీక్షలకు హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఈ అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన ఈ మేరకు ప్రకటించారు. ఈ తరగతుల బోర్డు పరీక్షలకు సంవత్సరంలో రెండుసార్లు హాజరయ్యే అవకాశాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. రెండుసార్లు పరీక్షలు రాసి, మెరుగైన స్కోరునే అంతిమంగా ఉంచుకుని, మిగిలిన దానిని రద్దు చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు.
2020లో ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) లక్ష్యాలలో భాగంగా విద్యార్థులపై విద్యాపరమైన ఒత్తిడిని తగ్గించడం కోసం ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆ మేరకు రాష్ట్రంలోని పాఠశాలలు అప్‌గ్రేడ్ చేయబడతాయన్నారు. అలాగే ప్రతి యేట పాఠశాలలో 10 బ్యాగులు లేని రోజులను ప్రవేశపెట్టాలనే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఇతర కార్యక్రమాలతో పాటు కళ, సంస్కృతి, క్రీడల్లో విద్యార్థులు చురుగ్గా పాల్గొనేలా కర్కిక్యులమ్ రూపొందించనున్నట్లు తెలిపారు. నూతన విద్యా విధానం ద్వారా విద్యార్థులను ఒత్తిడి లేకుండా ఉంచడం, నాణ్యమైన విద్యను వారికి అందించడం, విద్యార్థులకు సంస్కృతిపై ఆసక్తి కలిగించడం, భవిష్యత్తు కోసం వారిని సిద్ధం చేయడమే ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ జీ విజన్‌గా పేర్కొన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ఇదే ఫార్ములా అని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.
పీఎంశ్రీ పథకాన్ని మొదటి దశలో ఛత్తీస్‌గఢ్‌లోని 211 పాఠశాలలు (193 ప్రాథమిక స్థాయి, 18 సెకండరీ పాఠశాలలు) ప్రారంభించున్నట్లు తెలిపారు. తదుపరి దశలో మరిన్ని మాధ్యమిక, ఉన్నత మాధ్యమిక పాఠశాలలు ఈ పథకం కిందకు తీసుకువస్తామని ప్రధాన్ చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లోని పాఠశాలలను ‘హబ్ అండ్ స్పోక్’ మోడల్‌లో ఒకోదానికి రూ. 2 కోట్లు కేటాయించడం ద్వారా అప్‌గ్రేడ్ చేయబడతాయని మంత్రి తెలిపారు. 2036 ఒలింపిక్స్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇస్తుందని, చత్తీస్‌గఢ్ అథ్లెట్ల నుంచి దేశానికి కనీసం 10 శాతం పతకాలు రావాలని, ఈ ఏడాది నుంచే సన్నాహాలు ప్రారంభించాలని ఆయన పేర్కొన్నారు
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.