హైదరాబాద్, ఆగస్టు 21: తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. కన్వీనర్ కోటా కింద బీటెక్ సీట్లు పొంది కాలేజీల్లో చేరిన విద్యార్థులు అదే కళాశాలలో మరో బ్రాంచికి మారేందుకు అంతర్గత స్లైడింగ్ ఆగస్టు 21 నుంచి ప్రారంభం కానుంది. గత ఏడాది వరకు ఆయా కాలేజీల యాజమాన్యాలే ఈ ప్రక్రియను నిర్వహించేవి. దానివల్ల విద్యార్థులు బ్రాంచీలు మారితే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత ఉండేది కాదు. కానీ ఈసారి ప్రభుత్వమే స్లైడింగ్ చేపడుతోంది. ఈ ఏడాది బ్రాంచి మారినా బోధనా రుసుములు పొందేందుకు విద్యార్ధులకు అవకాశం కల్పిస్తున్నారు. ఖాళీ సీట్ల తుది జాబితా బుధవారం ఉదయం 11.30 గంటలకు వెబ్‌సైట్‌లో ఉంచుతామని, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆగస్టు 22 వరకు ఆప్షన్లు నమోదు చేసుకోవాలని ఇంజినీరింగ్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ శ్రీ దేవసేన సూచించారు. ఆగస్టు 24న సీట్లు కేటాయిస్తామని తెలిపారు. సీట్లు పొందిన వారు కొత్త బ్రాంచీల్లో ఆగస్టు 25వ తేదీలోగా చేరాలని సూచించారు.
కాగా కన్వీనర్ కోటాలో ఈడబ్ల్యూఎస్‌తో కలుపుకొని 86,943 సీట్లు ఉండగా… తుది కౌన్సెలింగ్‌లో 81,904 మందికి సీట్లు దక్కాయి. ఇందులో మిగిలిపోయిన సీట్లు 5,039 వరకు ఉన్నాయి. సీట్లు పొందిన వారిలో 75 వేల మంది వరకు మాత్రమే ఆయా కాలేజీల్లో ఇప్పటి వరకు ప్రవేశం పొందారు. మొత్తం మీద 11,900లకుపైగా సీట్లు మిగిలాయి. వాటి కోసం నేటి నుంచి స్లైడింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత స్పాట్ ప్రవేశాలు నిర్వహిస్తారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి మూడో విడత కౌన్సెలింగ్ నమోదు ప్రక్రియ ఆగస్టు 19 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆప్షన్ల ఎంపికకు విద్యార్థులకు 20 నుంచి 22వ తేదీ వరకు అవకాశం కల్పించింది. ఆగస్టు 23న ఆప్షన్ల మార్పు, ఆగస్టు 26న తుది విడత సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో మిగిలిన సీట్లను తుది విడత కౌన్సిలింగ్‌లో భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు ఆయా కాలేజీల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి.