SBI Asha Scholarship: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.15 లక్షల వరకు స్కాలర్‌షిప్.. చివరి తేదీ ఇదే!
SBI Asha Scholarship 2026-27: 9వ తరగతి నుంచి విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల వరకు అర్హత ఉన్న వారికి రూ.15,000 నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్‌షిప్ అందుతుంది. దరఖాస్తులకు సెప్టెంబర్ 19, 2026 చివరి తేదీ. ఏయే విద్యార్థులకు ఎంత మొత్తం స్కాలర్‌షిప్ వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

SBI Asha Scholarship 2026-27: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో SBI Foundation కీలక స్కాలర్‌షిప్‌ను అందిస్తోంది. SBI Platinum Jubilee Asha Scholarship 2026-27 పేరుతో అందిస్తున్న ఈ స్కాలర్‌షిప్ ద్వారా 9వ తరగతి నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేషన్, విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల వరకు ఆర్థిక సహాయం పొందవచ్చు. విద్యార్థులు చదువుతున్న కోర్సు, విద్యా సంస్థ, అర్హతలను బట్టి సంవత్సరానికి రూ.15,000 నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్‌షిప్ అందుతుంది.
సెప్టెంబర్ 19 వరకు దరఖాస్తులు
అధికారిక SBI Asha Scholarship పోర్టల్ ప్రకారం, 2026-27 విద్యా సంవత్సరానికి దరఖాస్తుల ప్రక్రియ జూలై 22, 2026న ప్రారంభమైంది. దరఖాస్తు గడువును పొడిగించి సెప్టెంబర్ 19, 2026 వరకు అవకాశం కల్పించారు. ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌లోనే పూర్తిచేయాలి.
9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు
9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు రూ.15,000 స్కాలర్‌షిప్ లభిస్తుంది. గత విద్యా సంవత్సరంలో కనీసం 75 శాతం మార్కులు లేదా 7.5 CGPA సాధించి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు మించకూడదు. అయితే SC/ST విద్యార్థులకు మార్కుల అర్హతను 65 శాతానికి, benchmark disabilities (PwBD) ఉన్న విద్యార్థులకు 60 శాతానికి తగ్గించారు.
UG విద్యార్థులకు రూ.75 వేల వరకు
అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు గరిష్ఠంగా రూ.75,000 వరకు స్కాలర్‌షిప్ అందుతుంది. విద్యార్థులు NIRF Overall ర్యాంకింగ్స్‌లో టాప్ 300లో ఉన్న విద్యాసంస్థలో లేదా NAAC ‘A’ లేదా అంతకంటే మెరుగైన గ్రేడ్ ఉన్న సంస్థలో చదువుతూ ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షల వరకు ఉండాలి.
PG, MBBS, IIT, IIM విద్యార్థులకు భారీగా ఆర్థిక సాయం
మాస్టర్స్ ప్రోగ్రామ్‌లు చదువుతున్న పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులకు అర్హతలను బట్టి రూ.1.5 లక్షల వరకు స్కాలర్‌షిప్ అందుతుంది. MBBS విద్యార్థులకు రూ.2 లక్షల వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది. ఇందుకోసం AIIMS లేదా NIRF మెడికల్ ర్యాంకింగ్స్‌లో టాప్ 50లో ఉన్న మెడికల్ కాలేజీలో చదువుతూ ఉండాలి. అలాగే ప్రస్తుత లేదా గత విద్యా సంవత్సరానికి సంబంధించిన చెల్లుబాటు అయ్యే NEET స్కోర్‌కార్డు ఉండాలి.
దేశంలోని 23 IITల్లో చదువుతున్న విద్యార్థులకు రూ.2 లక్షల వరకు స్కాలర్‌షిప్ అందుతుంది. ఇందుకోసం నిర్దేశిత విద్యా, ఆదాయ అర్హతలతో పాటు చెల్లుబాటు అయ్యే JEE Advanced స్కోర్‌కార్డు అవసరం. అదేవిధంగా దేశంలోని 22 IIMల్లో MBA/PGDM చదువుతున్న విద్యార్థులకు రూ.5 లక్షల వరకు స్కాలర్‌షిప్ పొందే అవకాశం ఉంది. అభ్యర్థులు నిర్దేశిత విద్యా, ఆదాయ అర్హతలతో పాటు CAT అర్హతను కూడా కలిగి ఉండాలి.
విదేశాల్లో చదివే వారికి రూ.15 లక్షల వరకు
విదేశాల్లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ లేదా అంతకంటే ఉన్నత విద్య అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులకు కూడా ఈ స్కాలర్‌షిప్ వర్తిస్తుంది. QS Top 200లో ఉన్న విశ్వవిద్యాలయంలో చదువుతున్న లేదా అక్కడి నుంచి అడ్మిషన్ ఆఫర్ పొందిన అర్హులైన విద్యార్థులకు రూ.15 లక్షల వరకు స్కాలర్‌షిప్ అందుతుంది. ఈ కేటగిరీకి దరఖాస్తు చేసుకునే వారు భారతీయ పౌరులై ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షల వరకు ఉండాలి. విద్యా అర్హతలతో పాటు ప్రస్తుత లేదా గత విద్యా సంవత్సరానికి సంబంధించిన GRE, GMAT, MCAT, LNAT లేదా LSAT స్కోర్‌కార్డులో ఏదో ఒకటి ఉండాలి.
ఎలా దరఖాస్తు చేయాలి?
అర్హత ఉన్న విద్యార్థులు అధికారిక SBI Asha Scholarship పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా అకౌంట్‌ను క్రియేట్ చేసుకుని లేదా లాగిన్ అయి, తమకు వర్తించే స్కాలర్‌షిప్ కేటగిరీని ఎంచుకోవాలి. అనంతరం అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తి చేసి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. సాధారణంగా విద్యా మార్కుల మెమోలు, ప్రభుత్వ గుర్తింపు పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ పాస్‌బుక్ వివరాలు, అడ్మిషన్ లేదా బోనఫైడ్ సర్టిఫికెట్, ఫీజుకు సంబంధించిన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. కేటగిరీని బట్టి ప్రవేశ పరీక్ష స్కోర్‌కార్డు, ఆఫర్ లెటర్, కుల ధ్రువీకరణ పత్రం లేదా వైకల్య ధ్రువీకరణ పత్రం వంటి అదనపు డాక్యుమెంట్లు కూడా అవసరం కావచ్చు.
ముఖ్యంగా.. దరఖాస్తును ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత అందులో మార్పులు లేదా సవరణలు చేసుకునే అవకాశం ఉండదని అధికారిక పోర్టల్ పేర్కొంది. కాబట్టి ఫారమ్‌ను సబ్మిట్ చేసే ముందు అన్ని వివరాలు, పత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలి. దరఖాస్తుల పరిశీలన అనంతరం షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు టెలిఫోన్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి ప్రక్రియలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
