
హైదరాబాద్, మే 26: సమ్మర్ హాలీడేస్ ను స్టుడెంట్స్ ఎంజాయ్ చేస్తుంటే.. వారి హైయర్ ఎడ్యూకేషన్ సీట్ల కోసం పేరెంట్స్ పరేషాన్ అవుతున్నారు. ఇంటర్ పూర్తైన విద్యార్థుల తల్లిదండ్రుల పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఎప్ సెట్ కౌన్సిలింగ్ ఖరారు కాకముందే కాలేజీలకు పేరెంట్స్ క్యూ కడుతున్నారు. ఇంటర్ ఫలితాలు, ఎప్ సెట్ ర్యాంకుల వెల్లడితో ఇంటర్ పూర్తైన విద్యార్థుల తల్లిదండ్రులు ఇంజినీరింగ్ కాలేజీల వైపు పరుగులు తీస్తున్నారు. ఇంటర్ లో మార్కులు సరిగా వచ్చినా ఎప్ సెట్ లో సరైన ర్యాంకు రాకపోవడం, కావాల్సిన కోర్సు దొరుకుతుందో లేదోనన్న కంగారుతో పేరెంట్స్ ముందే కాలేజీల్లో తమ పిల్లల సీటు కోసం కచ్చీప్ వేసే ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు. దీంతో ఇంజినీరింగ్ కాలేజీలు విద్యార్థుల తల్లిదండ్రులతో మండే సమ్మర్ లో సందడిగా మారాయి. ఎప్ సెట్ లో లక్షా 50 వేల మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. వీరిలో దాదాపు 30 నుంచి 40 వేల లోపు వారికి మంచి కాలేజీలు వస్తాయని పేరెంట్స్ అంచనా.
అందులోనూ అనుకున్న కోర్సు కావాల్సిన కాలేజీలో దక్కుతుందో లేదోనన్న ఆందోళన. దీంతో ఎప్ సెట్ కౌన్సిలింగ్ కంటే ముందే టాప్ కాలేజీల్లో సీట్ల దక్కించుకునేందుకు పేరెంట్స్ క్యూ కట్టారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ తర్వాత రిజర్వేషన్ల అమలు, సీట్లపై క్లారిటీ ప్రభుత్వం నుంచి వస్తే కానీ కౌన్సిలింగ్ నిర్వహణపై ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకోనుంది. ప్రధాన కాలేజీల్లో మేనేజ్ మెంట్ కోటాలో 10 లక్షలకు పైగా సీటు పలుకుతుండగా మరికొన్ని కాలేజీల్లో 2.5 నుంచి 10 లక్షల మధ్యలో ఉన్నాయి. దీంతో భారీగా పెరిగిన ఫీజులు తల్లిదండ్రులకు భారం అవుతున్నా మంచి కాలేజీలో సీటు కోసం కొంతమంది పేరెంట్స్ కూడా వెనకడుగు వేయడం లేదని సమాచారం.
ఇంజినీరింగ్ లో ఏఐ బేస్డ్ కోర్సులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా సీఎస్ఈ, ఈసీఈ కోర్సుల కోసమే పేరెంట్స్ ముందస్తుగా కాలేజీలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది, కంప్యూటర్ సైన్స్ కోర్సుకు అత్యంత భారీ డిమాండ్ నడుస్తోందట. పెరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో దాన్ని బేస్ చేసుకొని ఉన్న కోర్సుల గురించే తల్లిదండ్రులు ఆరా తీస్తున్నారు. ఐటీ, సీఎస్ఈ, ఈసీఈ సహా కంప్యూటప్ రిలేటర్ కోర్సుల సీట్లు కావాలంటూ మేనేజ్ మెంట్ కోటా సీట్ల కోసం కాలేజీ యాజమాన్యాలకు కన్వీన్స్ చేసే పనిలో పేరెంట్స్ పడ్డారు. కౌన్సిలింగ్ తర్వాత అయితే మేనేజ్ మెంట్ కోటా రేట్లు మరింత ఎక్కువ ఉంటాయని భయపడుతున్న తల్లిదండ్రులు అడ్వాన్స్ గా కచ్చీప్ వేయాలని క్యూకడుతున్నారు.
ఇక సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సుల వైపు విద్యార్థులు ఎక్కువగా మొగ్గు చూపడం లేదు. కలిసొచ్చే కాలం అంతా ఏఐదే అంటూ అటే వెంటపడుతున్నారు. ఇప్పటికే కాలేజీ యాజమాన్యాలతో ఫీజు నియంత్రణపై ఉన్నత విద్యామండలి చర్చించింది. ఎంత చెప్పినా ప్రైవేటు కాలేజీ లో ఫీజు దందా మారదు. పేరెంట్స్ కు భారం తప్పదు. ప్లేస్ మెంట్స్ బాగా ఉన్న కాలేజీల్లో సీట్లు కష్టతరంగా మారాయని పేరెంట్స్ చెబుతున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.