Layoffs: ఉద్యోగులపై లే ఆఫ్‌ కత్తి.. ఒకప్పుడు తిరుగులేదనుకున్న ఐటీ ఉద్యోగాలు.. నేడు వారి గుండెల్లో కలవరం

మేటి అనుకున్న ఐటీ జాబ్స్‌ .. అదిరిపడేలా చేస్తున్నాయి. భద్రం అనుకున్న కొలువులు.. పేకమేడలా కుప్పకూలుతున్నాయి. సాధారణ సంస్థల మాట అటుంచితే.. దిగ్గజ సంస్థల్లోనే ఎక్కువ కోతలు పడుతున్నాయి. వేల సంఖ్యలో ఉద్యోగాలు ఊడుతుండడంతో.. ఉద్యోగులు గుండెల్లో కలవరం రేగుతోంది..

Layoffs: ఉద్యోగులపై లే ఆఫ్‌ కత్తి.. ఒకప్పుడు తిరుగులేదనుకున్న ఐటీ ఉద్యోగాలు.. నేడు వారి గుండెల్లో కలవరం
Jobs Layoffs
Follow us
Subhash Goud

|

Updated on: Jan 29, 2023 | 4:50 PM

ఆర్ధిక మాంద్యం ఐటీ సెక్టార్లో కుదుపు రేపుతోంది. లే ఆఫ్లతో ఉద్యోగులు నడిరోడ్డుపైకి వస్తున్నారు. ఒకప్పుడు తిరుగులేదనుకున్న ఐటీ ఉద్యోగాలు.. నేడు కలవరం రేపేలా మారాయి. ఎప్పుడు ఎవరిని ఇంటికి పంపుతారో తెలియకుండా పోతోంది. చిన్న కంపెనీలే కాదు.. అంతర్జాతీయ గుర్తింపు పొందిన కంపెనీల్లో కూడా ఉద్యోగులపై లే ఆఫ్‌ కత్తి వేలాడుతోంది. ప్రస్తుత సీజన్‌లో 50వేలకుపైగా ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయారు. అమెజాన్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌, ట్విట్టర్‌, స్నాప్‌చాట్‌ ఇలా ఇకటేమిటీ అన్ని కంపెనీల్లో వేల ఉద్యోగాలు ఉఫ్‌ మంటూ ఊడిపోయాయి. ఇది ఇంతటితో ఆగేలా కూడా కనిపించడం లేదు. వచ్చే ఏడాది వరకు కాస్ట్‌ కటింగ్‌ కంటిన్యూ అవుతాయని చెబుతున్నాయి కంపెనీ వర్గాలు. ఇంకా లక్ష ఉద్యోగాల వరకు పోయే అవకాశముందని ఇండియాకు చెందిన ఓ రిక్రూట్‌మెంట్‌ సంస్థ చెబుతోంది. అంటే.. ఏ మేరకు ఐటీ ఎంప్లాయిస్‌పై ఈ ప్రభావం పడనుందో అర్ధం చేసుకోవచ్చు.

ఆఫీస్‌కు వెళ్లేంత వరకు తన ఉద్యోగం ఉందో లేదో తెలియకుండా మారింది ఐటీ ఉద్యోగుల పరిస్థితి. వర్క్‌ఫ్రమ్‌ హోం ఉన్న వారికి.. ఆ రోజు లాగిన్‌ అయ్యేందుకు అవకాశం రాలేదంటే అంతటితో ఆ కంపెనీతో తన అనుబంధం తెగిపోయినట్టే అని అర్ధం చేసుకోవాలి. కోవిడ్‌ సమయంలో చాలా కంపెనీలు డిజిటల్‌, టెక్నాలజీ, రిమోట్‌ వర్కింగ్‌, బయోటెక్నాలజీ, హెల్త్‌కేర్‌ విభాగాల్లో కొత్త ఉద్యోగులను పెద్ద ఎత్తున నియమించుకున్నాయి. కానీ ఇప్పుడా అవసరం లేదు. కాదు.. కాదు.. వారి అవసరాలు తీరిపోయాయి. యూజ్‌ అండ్‌ త్రో అన్నట్టుగా వారిపై వేటు వేస్తున్నాయి ఆయా కంపెనీలు.

ఆటోమేషన్‌ విస్తరించడం కూడా ఉద్యోగాల వేటుకు మరో కారణంగా చెబుతున్నారు. చాలా విభాగాల్లో ఆటోమేషన్‌ పద్దతి వచ్చేసింది. ఒక కంపెనీలో 10 మంది చేసే పనిని ముగ్గురితో అయిపోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫేస్‌ రికగ్నేషన్‌, క్వాంటమ్‌ టెక్నాలజీ, ఏఆర్‌ – వీఆర్‌, బ్లాక్‌ చైన్‌ వంటి సాంకేతికత పెరిగిపోవడంతో.. ఆయా విధులను నిర్వహించే స్టాఫ్‌ను కంపెనీలు తొలగించేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ఆర్ధిక మాంద్యం మరో ముప్పుగా మారింది. అమెరికాకు ఈ ఏడాది మాద్యం ఎఫెక్ట్‌ తప్పదన్న అభిప్రాయం మార్కెట్‌ వర్గాల్లో వినిపిస్తున్న మాట. చైనాలో ఇప్పటికే వృద్ది క్షీణించింది. ఆ రెండూ ఆర్ధికంగా పెద్ద దేశాలు.. దాంతో ఆర్ధిక వ్యవస్థపతనం అవుతుండడంతో.. ఆ ప్రభావం అభివృద్ది చెందుతున్న దేశాలపై చూపుతోంది. ఆ కారణంగా ఐటీ కంపెనీలు ముందస్తుగా జాగ్రత్త పడేలా ఉద్యోగులపై వేటు వేస్తూ వస్తున్నాయి.

ఐటీ రంగంలో పెద్ద ఎత్తున సాంకేతిక మార్పులు వస్తున్నాయి. వరల్డ్‌ ఎకనామిక ఫోరమ్‌ ఇటీవల అంచనా వేసిన ప్రకారం.. కూడా ఉద్యోగాలు భారీగా తగ్గిపోతాయని తెలిపింది. కొత్త టెక్నాలజీ అంటే ఏఐ, డిజిటల్‌ రంగాల్లో ఉద్యోగాలు రావచ్చని విశ్లేషించింది. 5 నుంచి 7 ఏళ్లకోసారి మార్పు సహజమని ఐటీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. ఎందుకంటే సాంకేతిక నైపుణ్యం కొత్త పుంతలు తొక్కుతున్న క్రమంలో దానికి అనుగుణంగా ఎంప్లాయిస్‌లో కూడా మార్పు రావాలని అంటున్నారు. లేదంటే ఇలాంటి లే ఆఫ్‌లు ఎదుర్కొకతప్పదని చెబుతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా భారత్‌లో కూడా ఉద్యోగాలపై కోత పడుతోంది. ఇంక్‌ 42. కామ్‌ నివేదిక ప్రకారం.. ఇండియాలో 18వేల మందిని తొలగించినట్టుగా ప్రకటించింది. అందులో బైజూస్‌, ఓలా, బ్లింకిట్‌, అన్‌అకాడమీ, వేదాంతు, వైట్‌హ్యాట్‌ వంటివి ఉన్నాయని తెలిపింది. ఇతర దేశాల్లో ఐటీ సెక్టార్‌లో ఎక్కువ సంఖ్యలో ఉన్నది మన భారత్‌లోనే. ఉద్యోగాలను కోల్పోతున్నది కూడా వారే కావడం కలకలం రేపుతున్న అంశంగా మారింది.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..