JEE Main 2025 Correction Window: జేఈఈ మెయిన్‌కు 12.80 లక్షల దరఖాస్తులు.. ఇవాళ్టితో ముగుస్తున్న ఎడిట్ ఆప్షన్

|

Nov 27, 2024 | 8:34 AM

ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో బీటెక్‌, బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ తొలి విడత దరఖాస్తు గడువు ముగిసిన సంగతి తెలిసిందే. దాదాపు 12.80 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అప్లికేషన్ లో ఏవైనా తప్పులు దొర్లితే ఈ రోజు గడువు సమయం ముగిసేలోపు..

JEE Main 2025 Correction Window: జేఈఈ మెయిన్‌కు 12.80 లక్షల దరఖాస్తులు.. ఇవాళ్టితో ముగుస్తున్న ఎడిట్ ఆప్షన్
JEE Main 2025 Correction Window
Follow us on

హైదరాబాద్, నవంబర్‌ 27: జేఈఈ మెయిన్‌ దరఖాస్తు గడువు నవంబరు 22వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభమైన తొలి రెండు వారాలు దరఖాస్తు ప్రక్రియ మందగమనంగా సాగినప్పటికీ.. ముగింపు తేదీ నాటికి ఊపందుకున్నాయి. మొదటి రెండు వారాల్లో కేవలం 5.10లక్షల మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. మొత్తానికి దేశ వ్యాప్తంగా పేపర్‌ 1, 2లకు కలిపి దేశవ్యాప్తంగా దాదాపు 12.80 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. గతేడాది జనవరి పేపర్‌ 1 పరీక్షకు (బీటెక్‌ సీట్లకు) 12.21 లక్షలు, పేపర్‌ 2కు (బీఆర్క్, బీప్లానింగ్‌ సీట్లు) 74 వేల చొప్పున దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 12.95 లక్షల మంది దరఖాస్తు చేశారు. అయితే గతేడాదితో పోల్చితే ఈసారి దరఖాస్తులు కాస్త తగ్గాయి. జాతీయ పరీక్షా నిర్వహణ సంస్థ (ఎన్‌టీఏ) విధించిన నిబంధనలే అందుకు కారణం. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1.50 లక్షల మంది ఈ ఏడాది జేఈఈ పరీక్ష రాస్తున్నారు.

జేఈఈ మెయిన్‌కు ఇప్పటివరకు హైదరాబాద్‌తో పాటు కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, సూర్యాపేట, సిద్దిపేట, కొత్తగూడెంలో పరీక్షా కేంద్రాలున్నాయి. ఈసారి కొత్తగా జగిత్యాలలో పరీక్ష నిర్వహించనున్నారు. ఏపీలో గతేడాది 29 చోట్ల పరీక్షలు జరిపింది. అయితే విద్యార్థుల నుంచి డిమాండ్‌ లేకపోవడంతో ఈసారి 22 ప్రాంతాల్లోనే పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లు చేయనున్నట్లు ఎన్‌టీఏ తెల్పింది.

ఇవాళ్టితో ముగుస్తున్న జేఈఈ మెయిన్‌ కరెక్షన్‌ విండో

జాయింట్‌ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్ 2025 సెషన్‌ 1 దరఖాస్తుల సవరణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నవంబర్‌ 26 నుంచి అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఇది నేటితో ముగుస్తుంది. అభ్యర్థులు తమ దరఖాస్తు వివరాల్లో తప్పులుంటే ఈ రోజు (నవంబర్‌ 27న) రాత్రి 11.50 గంటల వరకు సరిచేసుకోవచ్చు. ఇందుకు అదనపు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. రూ.1000 చెల్లించి దరఖాస్తుల్లో సవరణ చేసుకోవచ్చు. అయితే జేఈఈ మెయిన్ సెషన్-1 దరఖాస్తు సమయంలో వివరాలు తప్పుగా నమోదుచేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఒక్కసారి మాత్రమే వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వరు. అభ్యర్ధుల మొబైల్‌ నంబర్‌, ఈ-మెయిల్‌ అడ్రస్‌, చిరునామా, ఎమర్జెన్సీ కాంటాక్ట్‌ డిటైల్స్‌, అభ్యర్థి ఫొటోలో తప్ప మిగిలిన అంశాలను మార్పు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

జేఈఈ మెయిన్ 2025 కరెక్షన్‌ విండో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.