హైదరాబాద్, సెప్టెంబర్ 2: దేశవ్యాప్తంగా ఉన్న 653 జవహర్ నవోదయ విద్యాలయాల్లో (JNV) 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించవల్సిన జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2025 తేదీ వచ్చేసింది. వచ్చే ఏడాది (2025) జనవరి 18వ తేదీన ఎంట్రన్స్ టెస్ట్ జరుగనుంది. ఈ పరీక్ష ఫలితాలు అదే ఏడాది మార్చి నెలలో వెల్లడి చేయనున్నారు. ఇప్పటికే ఈ పరీక్షకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభించింది. సెప్టెంబర్ 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 24 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. వీటిల్లో తెలంగాణలో 9, ఆంధ్రప్రదేశ్‌లో15 చొప్పున విద్యాలయాలు ఉన్నాయి.
ఈ పరీక్ష రెండు సెషన్ల చొప్పున జరుగుతుంది. ఏప్రిల్ 12, 2025 (శనివారం) ఉదయం 11 గంటలకు ఒక సెషన్ పరీక్ష జరుగుతుంది. మిగిలిన విద్యార్ధులకు జనవరి 18, 2025వ తేదీ ఉదయం 11.30 గంటలకు రెండో సెషన్ పరీక్ష జరుగుతుంది. రాత పరీక్ష స్థానిక భాషల్లో కూడా నిర్వహిస్తారు. తెలుగుతో సహా ఇంగ్లిష్, హిందీ, మరాఠీ, ఉర్దూ, ఒరియా, కన్నడ, బోడో, బెంగాళీ, అస్సామీ, పంజాబీ వంటి అన్ని స్థానిక భాషల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు వసతి సౌకర్యం కల్పించారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా పాఠశాలల్లో ఐదో తరగతిలో చదువుతూ ఉండాలి. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు మే 1, 2013 నుంచి జులై 31, 2015 మధ్యలో జన్మించి ఉండాలి. ప్రవేశ పరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. వీటి కారణంగా జేఎన్‌టీయూహెచ్ పరిధిలో సెప్టెంబర్ 2న జరగాల్సిన అన్ని బీటెక్, బీఫార్మసీ, ఎంబీఏ పరీక్షలు వాయిదా వేసినట్లు వర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు తెలిపారు. సెప్టెంబర్ 2న జరగాల్సిన పరీక్షలను సెప్టెంబర్ 5న నిర్వహిస్తామన్నారు. అదే విధంగా ఉస్మానియా వర్సిటీ పరిధిలో కూడా నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ 3 నుంచి జరిగే పరీక్షలు యథాతథంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.