న్యూఢిల్లీ, మే 6: ఐసీఎస్‌ఈ (10వ తరగతి), ఐఎస్‌సీ (12వ తరగతి) ఫలితాలను కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ ఆఫ్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ బోర్డు (CISCE) సోమవారం (మే 6) విడుదల చేసింది. పరీక్షలు రాసిన విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్results.cisce.org లో చెక్ చేసుకోవచ్చు. విద్యార్ధులు తమ యునిక్ ఐడీ, ఇండెక్స్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసి ఫలితాలు పొందవచ్చు. విద్యార్ధులు తమ స్కోర్‌కార్డులు కెరీర్స్ పోర్టల్, డిజిలాకర్‌లోనూ పొందొచ్చు. ICSE, ISC కంపార్ట్‌మెంట్ పరీక్షలు 2024 నుంచి నిలిపివేసిన సంగతి తెలిసిందే.
ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాయాగోరే విద్యార్ధులు గరిష్ఠంగా ఏవైనా రెండు సబ్జెక్టుల్లో ఇంప్రూవ్‌మెంట్ రాసుకోవచ్చు. ఇందుకు సంబంధించి బోర్డు షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు జులైలో జరగనున్నాయి. కాగా ఈ ఏడాది జరిగిన ఐసీఎస్‌ఈ 10వ తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి పరీక్షలకు 2.5 లక్షల మంది రాశారు. వీరిలో పదో తరగతిలో బాలికలు 99.65 శాతం, బాలురు 99.31 శాతం ఉత్తీర్ణత శాతం సాధించారు. ఇక 12వ తరగతిలో బాలికలు 98.92 శాతం, బాలురు 97.53 శాతంగా ఉత్తీర్ణత పొందారు. గతేడాది పదో తరగతిలో 98.94 శాతం, 12వ తరగతిలో 96.93 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రెండింట్లోనూ బాలికలదే హవా. ఈ ఏడాది ఐసీఎస్‌ఈ పరీక్షలు మార్చి 28తో ముగియగా.. ఐఎస్‌సీ పరీక్షలు ఏప్రిల్ 13తో ముగిశాయి.
సీబీఎస్‌ఈ ఫలితాల కోసం ఎప్పుడెప్పుడా అని లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీబీఎస్సీ బోర్డు 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలు మే 20 తర్వాత వెల్లడించే అవకాశం ఉన్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) అధికారులు తాజాగా వెల్లడించారు. ఈ ఏడాది సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు జరగగా.. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా దాదాపు 39 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.