1998 డీఎస్సీలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఊరటనిచ్చే వార్త ఇది. దాదాపు 4,072 మంది అభ్యర్థులకు ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. వీరందరినీ సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, ఒప్పంద నిబంధన ప్రకారం 60ఏళ్లలోపు వారికి మాత్రమే పోస్టింగులు ఇవ్వాలని సూచించింది. బీఈడీ అర్హతతో నియామకాలు పొందిన అభ్యర్థులు ఏడాదిలోపు ఆరు నెలల్లో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాలని షరతు విధించింది పాఠశాల విద్యాశాఖ.
ఇదిలాఉంటే.. వీరి నియామకం కోసం ఖాళీలను సర్దుబాటు చేశారు అధికారులు. కొన్ని జిల్లాల్లో అభ్యర్థులు ఉండి, పోస్టులు లేని చోట ఖాళీలను సర్దుబాటు చేశారు. కొన్ని జిల్లాల్లో అదనంగా ఉన్న ఎస్జీటీ పోస్టులను ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. అప్పటి విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 2,524 పోస్టులు అదనంగా ఉండగా, వీటిలో 1,381 పోస్టులను శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలుకు బదిలీ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..