Common Examination: ఎడ్‌సెట్ పరీక్ష విధానంలో ప్రభుత్వం మార్పులు.. సబ్జెక్టుల వారీగా ర్యాంకుల విధానం రద్దు
Common Examination: బీఎడ్ కోర్సులో ప్రవేశం పొందేందుకు ఉద్దేశించిన ఎడ్‌సెట్ పరీక్ష విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్..
Common Examination: బీఎడ్ కోర్సులో ప్రవేశం పొందేందుకు ఉద్దేశించిన ఎడ్‌సెట్ పరీక్ష విధానంలో తెలంగాణ సర్కార్ప్ర మార్పులు చేసింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ) నిబంధనల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం విధానాన్ని సవరించింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి చిత్రా రామచంద్రన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఎడ్‌సెట్ పరీక్షను సబ్జెక్టుల వారీగా నిర్వహించేవారు. మొత్తం మూడు పరీక్షలు నిర్వహిస్తుండగా, ఇందులో పార్ట్-ఎ, పార్ట్-బీ అందరికీ కామన్ పరీక్ష కాగా, పార్ట్ -సీ మాత్రం ఎంచుకున్న సబ్జెక్టుకు సంబంధించి ఉండేది. తాజాగా ఈ విధానాన్ని మార్చారు. ఇక నుంచి అందరికీ ఒకటే పరీక్ష ఉంటుంది. ఈ పరీక్ష ప్రధానంగా అభ్యర్థుల్లో బోధనా నైపుణ్యాలను అంచనా వేసే విధంగా ఉంటుంది. సబ్జెక్టుల వారీగా అందుబాటులో ఉన్న సీట్లు, సాధించిన ర్యాంకుల ఆధారంగా ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తారు.
అలాగే బీఎడ్ చేసేందుకు సబ్జెక్టుల వారీగా అర్హతలపైనా జీవోలో స్పష్టత ఇచ్చారు. కళాశాలల్లో సీట్లలో 25 శాతం మ్యాథమెటిక్స్‌కు కేటాయించగా, ఫిజికల్, బయోలాజికల్ సైన్స్‌కు 30 శాతం, సోషల్, ఇంగ్లిష్ ఓరియంటల్ లాంగ్వేజీలలో సబ్జెక్టులకు 45 శాతం సీట్లు ఉంటాయి. పాత విధానంలో అర్హతల విషయంలో విద్యార్థులు గందరగోళానికి గురయ్యేవారని, దీంతో మంచి ర్యాంకు సాధించినా సంబంధిత సబ్జెక్టుల్లో ప్రవేశాలను పొందడంలో విఫలమయ్యేవారని తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 203 బీఎడ్ కళాశాలల్లో సుమారు 18వేల సీట్లున్నాయి.