AP Constable Fitness Tests Postponed: కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు అలర్ట్.. దేహదారుఢ్య పరీక్షలు వాయిదా! కారణం ఇదే

|

Jan 06, 2025 | 2:11 PM

రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే పలు జిల్లాల్లో ఈ పరీక్షలు కొన్ని కారణాల వల్ల వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఈవెంట్స్ వాయిదా పడిన విషయాన్ని పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ ఎం రవిప్రకాశ్‌ జనవరి 5న ఓ ప్రకటనలో తెలిపారు. తిరిగి ఈవెంట్స్ జరిగే తేదీలను కూడా ఆయన ప్రకటించారు. ఎప్పుడెప్పుడంటే..

AP Constable Fitness Tests Postponed: కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు అలర్ట్.. దేహదారుఢ్య పరీక్షలు వాయిదా! కారణం ఇదే
AP Constable Fitness Tests
Follow us on

అమరావతి, జనవరి 6: ఆంధ్రప్రదేశ్‌ కానిస్టేబుల్‌ నియామక ప్రక్రియకు సంబంధించిన దేహదారుఢ్య పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా పలు కేంద్రాల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. మొత్తం 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఫిబ్రవరి 1వ తేదీ వరకు పోలీస్‌ కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు ఫిజికల్‌ మెజర్‌మెంట్‌, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. అయితే పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సంబంధించి జనవరి 8 నుంచి 10వ తేదీ మధ్య జరగాల్సిన పీఎంటీ, పీఈటీ దేహదారుఢ్య పరీక్షలు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాయిదా పడ్డాయి. వీటిని తిరిగి జనవరి 11 నుంచి 20వ తేదీన మధ్య నిర్వహించనున్నట్లు పోలీస్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించింది.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు గతంలో జనవరి 8వ తేదీన దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తామని పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటించింది. ఈ తేదీన జరగవల్సిన ఈవెంట్స్‌ వాయిదా వేసిన బోర్డు తిరిగి ఈ పరీక్షలను జనవరి 11వ తేదీన నిర్వహించనున్నారు. అలాగే అనంతపురంలో జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు జరగవల్సిన ఈవెంట్స్‌.. ఈ తేదీలకు బదులు జనవరి17, 18, 20వ తేదీల్లో జరగనున్నాయి. చిత్తూరులో జనవరి 8, 9 తేదీల్లో జరగవల్సిన ఈవెంట్స్‌.. జనవరి 17, 18 తేదీలకు వాయిదా పడ్డాయి. వైకుంఠ ఏకాదశి, శాంతి భద్రతల సమస్యలను దృష్టిలో పెట్టుకుని వీటిని వాయిదా వేసినట్లు పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ ఎం రవిప్రకాశ్‌ జనవరి 5న ఓ ప్రకటనలో తెలిపారు. ఆ మేరకు అభ్యర్ధులు దేహదారుఢ్య పరీక్షలు వాయిదా పడిన విషయాన్ని గమనించాలని, జనవరి 11 నుంచి తిరిగి యథాతథంగా ఆయా జిల్లాల్లో ఈవెంట్స్‌ ప్రారంభమవుతాయని ఆయన స్పష్టం చేశారు.

కాగా రాష్ట్రంలో 6100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 2022లో నోటిఫికేషన్‌ విడుదలవగా.. గతేడాది జనవరి 22న ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 4,58,219 మంది హాజరయ్యారు. గతేడాది ఫిబ్రవరి 5న ప్రిలిమ్స్ ఫలితాలు కూడా వెలువడ్డాయి. మొత్తం 95,209 మంది అభ్యర్ధులు ఫిజికల్‌ టెస్టులకు ఎంపికయ్యారు. వీరిందరికీ డిసెంబర్‌ 30వ తేదీ నుంచి దేహదారుఢ్య పరీక్షలు జరుగుతున్నాయి. కాల్ లెటర్ లో తెలిపిన తేదీ, సమయానికి అభ్యర్థులు తప్పనిసరిగా మైదానంలోకి వెళ్లవల్సి ఉంటుంది. నిర్ణీత సమయానికి అభ్యర్థి హాజరు కాకపోతే అభ్యర్థులను మైదానంలోకి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరు. దేహదారుఢ్య పరీక్షలకు సంబంధించి కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 9441450639, 9100203323 ఫోన్‌ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.