అమరావతి, ఫిబ్రవరి 14: రాష్ట్రంలో గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో గ్రూప్ 2 పరీక్ష హాల్‌టికెట్లను ఏపీపీఎస్సీ బుధవారం (ఫిబ్రవరి 14) విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కమిషన్ అధికాబరిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన అన్ని పరీక్ష కేంద్రాల్లో ఫిబ్రవరి 25వ తేదీన ప్రిలిమ్స్ రాత పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష రోజున ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు ఆఫ్‌లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహించనున్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమ్స్ హాల్‌టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాగా మొత్తం 897 గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఏస్సీ) ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. వీటిల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు 331, నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు 566 వరకు ఉన్నాయి. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4.83 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబర్ 21వ తేదీ నుంచి జనవరి 17 వరకు ఆన్‌లైన్‌లో ఏపీపీఎస్సీ దరఖాస్తులు స్వీకరించింది. స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మెయిన్స్ పరీక్ష తేదీని త్వరలో ప్రకటించనున్నారు.
ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో ఆఫ్‌లైన్‌లో ఉంటుంది. మొత్తం 150 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు 150 మార్కులకు గానూ 2.30 గంటల్లో ఓఎంఆర్ షీట్‌పై సమాధానాలు గుర్తించవల్సి ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి మాత్రమే మెయిన్స్ రాసేందుకు అవకాశం ఉంటుంది. మెయిన్స్‌లో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1, పేపర్-2లో 150 చొప్పున ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. ఇంటర్వ్యూ ఉండదు. మెయిన్స్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.