అమరావతి, జులై 31: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మెడికల్ విద్యార్ధుల నీట్ – యూజీ రాష్ట్ర ర్యాంకులను ఆగస్టు 2న వెల్లడించనున్నారు. నీట్ యూజీ 2024 జాతీయ స్థాయి ర్యాంకులను ఇటీవల కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్‌ఎంసీ నుంచి ర్యాంకుల వివరాలను సేకరించిన తర్వాత.. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య యూనివర్సిటీ జులై 26న రాష్ట్ర స్థాయి ర్యాంకుల జాబితా ప్రకటించనుంది. దీనికి అనుగుణంగా విద్యార్థులు రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర యూజీ కోర్సుల్లో 2024 – 25 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ఆల్ ఇండియా కౌన్సెలింగ్ ఆగస్ట్ 14 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ఇప్పటికే కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. అక్టోబర్1 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
ఆగస్టు తొలి వారం నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ప్రకటించింది. ఈ సంస్థ ప్రకటించిన తేదీల్లోనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కౌన్సెలింగ్‌ను నిర్వహించాలి. పేపర్ లీకులు, అవకతవకల నేపథ్యంలో ఇటీవల సవరించిన మార్కులు, ర్యాంకుల జాబితాను ఎన్టీఏ విడుదల చేసింది. దీని ప్రకారం ఏపీలో మొత్తం 64,299 మంది విద్యార్థులు నీట్ రాయగా.. వారిలో 43,788 మంది అర్హత సాధించారు. జూన్ 4 తేదీ నాటి ఫలితాలతో పోలిస్తే సవరించిన ర్యాంకుల కారణంగా ఏపీలో దాదాపు 70 మంది విద్యార్థులు అనర్హులుగా మారారు. అటు తెలంగాణలోనూ 15 మంది నీట్ అర్హత కోల్పోయారు. రాష్ట్రం నుంచి నీట్‌లో అర్హత సాధించిన విద్యార్థుల జాబితా ఎన్టీఏ నుంచి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి రావాల్సి ఉంది. వర్సిటీ ప్రతినిధి ఢిల్లీకి వెళ్లి ఈ సమాచారం తీసుకుని రావల్సి ఉంటుంది. ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ ప్రారంభమైన అనంతరం రాష్ట్రస్థాయిలో వైఎస్సార్ ఆరోగ్య వర్సిటీ కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందన్న సంగతి తెలిసిందే.