అమరావతి, ఏప్రిల్ 10: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 12వ తేదీన విడుదల చేసేందుకు రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు (BIEAP) ఏర్పాట్లు చేస్తోంది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి ఫలితాలను ఒకేసారి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే మూల్యాంకన ప్రక్రియ పూర్తికాగా.. ఫలితాలకు సంబంధించిన అంతర్గత ప్రాసెస్ ఏప్రిల్ 10న మధ్యాహ్నంతో పూర్తి చేసేలా అధికారులు కార్యచరణ రూపొందించారు. ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే ఫలితాల ప్రకటన ఒకటి లేదా రెండు రోజులు ఆలస్యంగా విడుదలయ్యే అవకాశం ఉంది.
కాగా ఈ ఏడాది రెగ్యులర్, ఒకేషనల్ విద్యార్థులు కలిపి మొత్తం 10,52,673 మంది విద్యార్ధులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మొదటి ఏడాది విద్యార్ధులు 5,17,617 మంది ఉండగా.. రెండో ఏడాది చెందిన విద్యార్ధులు 5,35,056 మంది వరకు ఉన్నారు. పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరిలో పరీక్షలకు 52,900 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు.
జేఈఈ మెయిన్ తుది విడత పేపర్ 1 పరీక్షలు ఏప్రిల్ 9వ తేదీతో ముగిశాయి. ఈ పరీక్షలకు దేశ వ్యాప్తంగా సుమారు 12 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 95 శాతం విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరో నాలుగు రోజుల్లో విడుదల చేయనుంది. తొలి, మలి విడత పరీక్షల్లో వచ్చిన మార్కుల్లో ఉత్తమ స్కోర్‌ను అంతిమంగా పరిగణనలోకి తీసుకుంటారు. ఆ విధంగా ఫైనల్‌గా తేల్చిన మార్కుల ఆధారంగా ఏప్రిల్ 20వ తేదీన ర్యాంకులను ప్రకటిస్తుంది. కాగా ఈసారి క్వశ్చన్ పేపర్ కొంత సులువుగా వచ్చినట్లు జేఈఈ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇక జేఈఈ మెయిన్ పేపర్ 2 పరీక్ష ఏప్రిల్ 12వ తేదీన జరగనుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.