AP TET 2024 Hall Tickets: అక్కడి సీన్ ఇక్కడ రిపీట్.. ఒకే రోజు రెండు ‘టెట్’ పరీక్షలు! అభ్యర్థుల్లో గందరగోళం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తగా అక్టోబర్ 3వ తేదీ నుంచి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ 2024) పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ హాల్ టికెట్లను కూడా విడుదల చేసింది. అయితే మెథడాలజీ సబ్జెక్టులు రెండు ఉండటంతో కొందరు రెండు సబ్జెక్టులకూ టెట్ రాస్తున్నారు. ఆదివారం విడుదలైన టెట్ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్న చాలా మంది అభ్యర్ధులకు ఒకే రోజు..
అమరావతి, సెప్టెంబర్ 23: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తగా అక్టోబర్ 3వ తేదీ నుంచి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ 2024) పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ హాల్ టికెట్లను కూడా విడుదల చేసింది. అయితే మెథడాలజీ సబ్జెక్టులు రెండు ఉండటంతో కొందరు రెండు సబ్జెక్టులకూ టెట్ రాస్తున్నారు. ఆదివారం విడుదలైన టెట్ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్న చాలా మంది అభ్యర్ధులకు ఒకే రోజు ఒకే సమయంలో రెండు పరీక్షలు వేర్వేరు పరీక్ష కేంద్రాల్లో కేటాయించడం గమనార్హం. ఈ మేరకు హాల్ టికెట్లను విడుదల చేశారు కూడా. ఏక కాలంలో రెండు వేర్వేరుచోట్ల పరీక్ష రాయడం ఎలాగో తెలియక అభ్యర్ధులు తలలు పట్టుకుంటున్నారు.
డీఎస్సీ నియామకాలకు టెట్ మార్కుల వెయిటేజీ ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే డీఎస్సీకి ముందు టెట్ నిర్వహిస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించిన నేపథ్యంలో చాలామంది ఉపాధ్యాయ ఉద్యోగం పొందటానికి కీలకమైన టెట్ కోసం సాధన చేస్తున్నారు. అక్టోబరు 3 20 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, ఇటీవల ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు విడుదల చేశారు. అయితే కొందరికి ఒకేరోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించడంతో వారంతా సంకటంలో పట్టారు. ఏదైనా ఒక పరీక్ష మాత్రమే రాయవల్సిన పరిస్థితి నెలకొంది.
ఏలూరు మండలం చొదిమెళ్లకు చెందిన సీహెచ్ సంధ్యాభవానీకి పేపర్-1బీ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా అక్టోబరు 6న ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పరీక్ష సమయాన్ని తెలుపుతూ ఏలూరు సిద్ధార్థ క్వెస్ట్ సీబీఎస్‌ఈ పాఠశాలను పరీక్షా కేంద్రంగా కేటాయించారు. ఆమె పేపర్-1ఏకు కూడా దరఖాస్తు చేసుకోగా.. ఆ పరీక్ష అదేరోజు ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు సమయాన్ని పేర్కొంటూ విజయవాడలోని కానూరులోని కేంద్రం ఇచ్చారు. ఒకే సమయంలో రెండు వేర్వేరు చోట్ల ఎలా రాయాలో తెలియక సందిగ్ధంలో పడింది. ముదునూరుపాడుకు చెందిన పి జయలక్ష్మి అనే అభ్యర్ధికి కూడా ఎస్‌జీటీ, స్కూలు అసిస్టెంట్ పేపర్లకు ఉదయం ఏలూరులోని ఒక పరీక్షా కేంద్రాన్ని, మధ్యాహ్నం కాకినాడలోని మరో కేంద్రాన్ని ఇచ్చారు. ఏలూరు నుంచి కాకినాడ వెళ్లేందుకు కనీసం 3 గంటలు పడుతుంది. ఒకే రోజు ఒక పరీక్ష రాసిన తర్వాత మరో పరీక్షకు ఎలా హాజరుకావాలో తెలియక ఆందోళన చెందుతుంది. ఇలా ఈ ఇద్దరికే కాదు.. రెండు పరీక్షలు రాసే చాలా మందికి ఇలా వేర్వేరు పరీక్ష కేంద్రాలు కేటాయించడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు.
సరిగ్గా ఇలాంటి పరిస్థితితే ఈ ఏడాది తెలంగాణలోనూ జరిగింది. ఆ రాష్ట్రంలో టెట్, డీఎస్సీ పరీక్ష నిర్వహించగా.. వారికీ ఇలాగే జరిగింది. కొందరికి ఒకే రోజు వేర్వేరు చోట్ల రెండు పరీక్షలు నిర్వహించేలా హాల్ టికెట్లు ఇచ్చారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో.. దిగొచ్చిన అధికారులు రెండేసి పరీక్షలు రాసే వారికి ఒకే పరీక్ష కేంద్రం కేటాయిస్తూ మళ్లీ కొత్తగా హాల్ టికెట్లు జారీ చేశారు. తాజా ఘటనపై ఏపీ సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.