AP Summative 1 Exams: లీకు రాయుళ్ల పైత్యం.. స్కూల్‌ పిల్లల సమ్మెటివ్‌ 1 మ్యాథ్స్‌ క్వశ్చన్‌ పేపర్‌ లీక్‌! పరీక్ష వాయిదా

ఇప్పటి వరకూ క్వశ్చన్ పేపర్ల లీకేజీలు కాలేజీ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు విస్తరించాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చివరి ఘట్టం కూడా పూర్తించారు లీకు రాయుళ్లు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న సమ్మెటివ్ 1 పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి..

AP Summative 1 Exams: లీకు రాయుళ్ల పైత్యం.. స్కూల్‌ పిల్లల సమ్మెటివ్‌ 1 మ్యాథ్స్‌ క్వశ్చన్‌ పేపర్‌ లీక్‌! పరీక్ష వాయిదా
SA 1 Maths question paper leaked
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 17, 2024 | 2:16 PM

అమరావతి, డిసెంబర్‌ 17: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో సమ్మెటివ్‌ 1 పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సోమవారం (డిసెంబర్‌ 16) గణిత సబ్జెక్ట్‌ పరీక్షలు జరిగాయి. అయితే పరీక్ష సోమవారం ప్రారంభంకాక ముందే గణితం ప్రశ్నపత్రాలు లీక్‌ కలకలం రేపింది. దీంతో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు నిర్వహించాల్సిన గణితం పరీక్షలను విద్యాశాఖ రద్దు చేసింది. సోమవారం రద్దయిన గణిత పరీక్షలను డిసెంబరు 20న నిర్వహించనున్నట్లు ఎస్‌సీఈఆర్టీ ప్రకటించింది. గణిత ప్రశ్నపత్రంతోపాటు జవాబులు కూడా శుక్రవారమే సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడం చర్చణీయాంశంగా మారింది.

జవాబులతో సహా పేపర్లు లీక్‌ కావడంతో విద్యాశాఖ ఈ పరీక్షలను రద్దు చేసి, పరీక్ష నిర్వహించకుండానే ఈ సబ్జెక్ట్‌ పరీక్షను ఎస్‌సీఈఆర్టీ వాయిదా వేసింది. మళ్లీ కొత్తగా ప్రశ్నపత్రాలు రూపొందించి, పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అలాగే పాఠశాలల్లో అంతర్గతంగా నిర్వహించే ఈ పరీక్షల్లో అవకతవకలు చోటుచేసుకోకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సిఫార్సులు చేసేందుకు నలుగురు అధికారులతో కూడిని కమిటీని నియమించింది. మరోవైపు క్వశ్చన్‌ పేపర్ల లీక్‌ వ్యవహారంపై అధికారులు విజయవాడ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

కాగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో అంతర్గతంగా నిర్వహించే పరీక్షలకు ఉమ్మడి ప్రశ్నపత్రాలు రూపొందిస్తున్నారు. దీంతో గత కొన్నేళ్లుగా ప్రశ్నాపత్రాల లీకేజీలు వరుసగా చోటుచేసుకోవడంతో కూటమి సర్కార్‌ దీనిని సీరియస్‌గా తీసుకుంది. ప్రశ్నపత్రం లీకు నివారణకు ఇప్పటి వరకు మండల విద్యా కార్యాలయం, స్కూల్‌ కాంప్లెక్స్‌కు చేరుకున్న ప్రశ్నపత్రాలను ఇకపై పోలీస్‌ స్టేషన్లకు తరలించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పీఎస్‌ నుంచే అయా పాఠశాలలకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అనంతరం 6, 8, 10 తరగతులకు 9.15 గంటల నుంచి 12.30 గంటలు, 7, 9 తరగతులకు మధ్యాహ్నం 1.15 గంటల నుంచి 4.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించాలి. ఈ మేరకు పరీక్ష రోజున ఉదయం, మధ్యాహ్నం రెండు సార్లు తమకు సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఉపాధ్యాయులు ప్రశ్నపత్రాలు తీసుకురావాల్సి ఉంటుంది. ఈ ఏడాది జాతీయ స్థాయి పరీక్షల నుంచి పలు రాష్ట్రాల నియామక, ప్రవేశ పరీక్షల వరకు వరుస పేపర్‌ లీకేజీలు ప్రకంపనలు సృష్టించాయి. ఏడాది చివరిలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ పాఠశాల పిల్లల ప్రశ్నాపత్రాలు సైతం లీకు కావడం విద్యాశాఖ చిత్తశుద్దిపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.