అమరావతి, జనవరి 8: ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు తరగతుల సిలబస్‌లో పాఠశాల విద్యాశాఖ మార్పులు తీసుకొస్తోంది. జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) మినహాయించిన పాఠ్యాంశాలను తొలగించి, కొత్త పుస్తకాలు ముద్రించనుంది. తొమ్మిది, పది తరగతుల్లో ప్రస్తుతం ఉన్న ఎన్‌సీఈఆర్టీ హిందీ సిలబస్‌ను తొలగించనుంది. దీని స్థానంలో గతంలో రాష్ట్ర సిలబస్‌లోని హిందీ పుస్తకాలను తిరిగి ప్రవేశపెట్టనుంది. హిందీ సబ్జెక్టు సిలబస్ ఎక్కువగా ఉండటం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇక ప్రస్తుతం 6,7,8 తరగతుల్లో హిందీ సబ్జెక్టులో రాష్ట్ర సిలబస్‌నే అమలు చేస్తోంది. దీనిలో ఎలాంటి మార్పు ఉండబోదని విద్యాశాఖ స్పష్టం చేసింది.
దేశంలోని ప్రముఖ ఐఐటీలతోపాటు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) 2025 అడ్మిట్ కార్డులను విడుదల చేసినట్లు ఐఐటీ రూర్కీ వెల్లడించింది. గేట్ 2025 పరీక్షలను ఫిబ్రవరి 1, 16 తేదీల్లో నిర్వహించనున్నారు. కాగా గేట్ స్కోర్ ఆధారంగా జాతీయస్థాయిలోని విద్యాసంస్థల్లో మాత్రమే కాకుండా పలు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించి, నేరుగా ఉద్యోగాలు కల్పిస్తాయన్న సంగతి తెలిసిందే.
గేట్ 2025 అడ్మిట్ కార్డుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
న్యూఢిల్లీలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ)- నార్త్ రైల్వే ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ 2024 ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఎన్‌ఆర్ పరిధిలోని డివిజన్, వర్క్‌షాప్ యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం 4096 పోస్టులతో గత ఆగస్టులో నోటిఫికేషన్ విడుదలవగా.. తాజాగా ఎంపిక జాబితా విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్‌లో మెరిట్ లిస్ట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.