AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Mega DSC 2025 Merit List: మరికొన్ని గంటల్లోనే మెగా డీఎస్సీ మెరిట్‌ లిస్ట్‌ విడుదల.. విద్యాశాఖ అధికారికంగా వెల్లడి

రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ మెరిస్ట్ లిస్ట్ విడుదలకు శుభ ముహూర్తం ఫిక్సైంది. ఈ మేరకు తాజాగా కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ప్రకటన జారీ చేశారు. తాజా ప్రకటన మేరకు మెరిట్ లిస్ట్ వివరాలతోపాటు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు సంబంధించిన విషయాలను..

AP Mega DSC 2025 Merit List: మరికొన్ని గంటల్లోనే మెగా డీఎస్సీ మెరిట్‌ లిస్ట్‌ విడుదల.. విద్యాశాఖ అధికారికంగా వెల్లడి
AP Mega DSC 2025 merit list
Srilakshmi C
|

Updated on: Aug 21, 2025 | 9:13 PM

Share

అమరావతి, ఆగస్ట్ 21: మెగా DSC-2025 పరీక్షలు పూర్తిగా నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం, సాంకేతిక భద్రతతో, పారదర్శకంగా, పకడ్బందీగా విజయవంతంగా నిర్వహించడం జరిగిందని మెగా DSC కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి తెలిపారు. ఫలితాల అనంతరం టెట్ మార్కులు సరిచేసుకోవడానికి అభ్యర్థులకు తగిన సమయం ఇవ్వడం జరిగిందన్నారు. అభ్యర్థుల స్కోర్ కార్డులు విడుదల చేసిన తర్వాత కూడా ప్రతిభ కనబరిచిన ఏ అభ్యర్థి నష్టపోకూడదనే ఆలోచనతో టెట్ మార్కుల వివరాలు సవరించుకోవడానికి ఆఖరి అవకాశం కూడా ఇచ్చామన్నారు. స్పోర్ట్స్ కోటా మెరిట్ జాబితా కూడా పూర్తి అయిన నేపథ్యంలో ఈ నెల 22వ తేదీన మెరిట్ లిస్ట్ విడుదల చేయడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. మెరిట్ లిస్ట్ జాబితా డీఎస్సీ అధికారిక వెబ్సైటుతో పాటు జిల్లా విద్యాధికారి వెబ్సైటులో కూడా ఉంచడం జరుగుతుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుండి మాత్రమే సమాచారం పొందాలి.

వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా ‘జోన్ ఆఫ్ కన్సిడరేషన్’ లోకి వచ్చిన అభ్యర్థులకు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందించబడుతుంది. సదరు అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఇటీవల తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం, గజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన మూడు సెట్లు జెరాక్స్ కాపీలు, 5 పాస్ పోర్టు సైజు ఫోటోలతో సర్టిఫికెట్లు వెరిఫికేషనుకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది. వెరిఫికేషనుకు హాజరు కావడానికి మునుపే సంబంధిత సర్టిఫికెట్లను వెబ్‌సైట్లో అప్ లోడ్ చేయడం తప్పనిసరి. వెరిఫికేషన్ సమయంలో సమర్పించవలసిన సర్టిఫికెట్ల వివరాలతో కూడిన చెక్ లిస్ట్ డీఎస్సీ వెబ్‌సైటులో అందుబాటులో ఉంచడం జరుగుతుంది. సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో అభ్యర్థి హాజరు కాకపోయినా, సరైన సర్టిఫికెట్లు సమర్పించకపోయినా, తగిన విద్యార్హతలు లేనట్లుగా రుజువైనా మెరిట్ లిస్టులో తరువాత ఉన్న అభ్యర్థికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది.

ఉపాధ్యాయ ఉద్యోగం ఇప్పిస్తామని దళారులు చెప్పే మాటలు, కొంతమంది సోషల్ మీడియా వేదికగా, అసత్య వదంతులు వ్యాప్తి చేస్తూ అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తూ, అభ్యర్థుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి దుష్ప్రచారాలను నమ్మి అభ్యర్థులు మోసపోవద్దని, ఇలాంటి వదంతులు సృష్టించి వ్యాప్తి చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైంది. కాబట్టి అభ్యర్థులు కేవలం డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న ప్రకటనలు, నోటిఫికేషన్లు, ఫలితాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని తెలియజేయడమైనది. అభ్యర్థుల వ్యక్తిగత స్కోర్లు, మెరిట్ లిస్ట్, ఎంపిక జాబితాలు, నియామక ఉత్తర్వులు మెగా డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌, జిల్లా విద్యాధికారి వెబ్‌సైట్‌, క్యాండిడేట్ లాగిన్, ప్రభుత్వం ద్వారా విడుదల చేయబడే పత్రికా ప్రకటనల ద్వారా మాత్రమే తెలియజేయబడతాయి. రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందించేందుకు అర్హులైన అభ్యర్థులను పారదర్శకంగా నియమించాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని కన్వీనర్‌ ఎంవి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ప్రకటన జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.