అమరావతి, జులై 30: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా జులై 20వ తేదీ వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు జరిగాయి. కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్ ఐచ్ఛికాల నమోదుకు జులై 23 నుంచి 29 వరకు అవకాశం ఇచ్చారు. అయితే తాజాగా విద్యార్థులో అయోమయం నెలకొంది. ఇంజినీరింగ్ కళాశాలల్లోని బీబీఏ, బీసీఏ కోర్సులకు ఇంకా ఫీజులు ఖరారు కాలేదు. దీంతో ఆయా కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్ధుల్లో సందిగ్ధత ఏర్పడింది. దీంతో బీబీఏ, బీసీఏ కోర్సులకు ఫీజులు ఖరారు కానందున వెబ్‌ఐచ్ఛికాలను వాయిదా వేశారు. ఈ క్రమంలో జులై 30 నుంచి వెబ్ ఐచ్ఛికాలకు అవకాశం ఉంటుందా లేదా రిజిస్ట్రేషన్లకు మరోసారి గడువు పొడిగిస్తారా? అనేదానిపై ఉన్నత విద్యామండలి స్పష్టత ఇవ్వలేదు. కాగా డిగ్రీ ప్రవేశాలకు మొత్తం 1,64,418 మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. వీరిలో 1,62,750 మంది ఫీజులు చెల్లించారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో మాత్రం సందిగ్ధత నెలకొంది.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ప్రవేశాలకు కామన్ అడ్మిషన్ టెస్టు (క్యాట్)-2024 ప్రవేశ పరీక్ష నవంబర్ 24న జరగనుంది. ఈ మేరకు క్యాట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 13 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి. నవంబర్‌లో 24న పరీక్ష నిర్వహించి, జనవరి రెండో వారంలో ఫలితాలు విడుదల చేస్తారు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్థులు రూ.2500, ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులు రూ.1250 చొప్పుఉన రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తుల్లో అభ్యర్ధులు తప్పనిసరిగా తమ ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ పొందుపరచవల్సి ఉంటుంది.
తెలంగాణ ఉపాధ్యాయుల పదోన్నతుల్లో ఎస్జీటీలకు అన్యాయం జరిగిందని పలువురు ఆరోపించారు 10వేల పీఎస్‌హెచ్‌ఎం కొత్త పోస్టులు మంజూరు చేసి, వాటిని పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ ఎస్జీటీ నాయకులు రామదాసు, అనిల్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు.