Motivation Story: 62 ఏళ్ల వయసులో ఐసెట్‌ పరీక్షరాసి 178వ ర్యాంకు! ఈ పెద్దాయన జీవిత పాఠం మీకు చెప్పాలి..

ఆదిలాబాద్‌లోని ఐసెట్‌ ఆన్‌లైన్‌ పరీక్ష కేంద్రంలోకి ఓ పెద్దాయన (62) సడెన్‌గా ఎంట్రీ ఇవ్వడంతో అంతా పరీక్ష కేంద్రం ఇన్విజిలేటర్‌ అనుకున్నారు. కానీ ఆయనేమో చేతిలో హాల్‌ టికెట్ పట్టుకుని తన సీటు వెతుక్కుని కేటాయించిన కంప్యూటర్‌ ముందు సీట్లో కూర్చవడంతో అభ్యర్థులంతా షాకయ్యారు. అంతేనా చక్కగా పరీక్ష రాసి ఏకంగా 178వ ర్యాంకు తెచ్చుకున్నాడు.. అయితే ఆయన ఈ వయసులో పరీక్షరాసింది చదువుకోవడానికి కాదు.. భార్య, కొడుకు నెలల వ్యవధిలోనే తనను ఒంటరి వాడిని చేసి వెళ్లడంతో దిక్కుతోచని ఆ పెద్దాయన పిల్లల్లో స్ఫూర్తిని నింపడానికి ఈ పరీక్ష రాశాడట..

Motivation Story: 62 ఏళ్ల వయసులో ఐసెట్‌ పరీక్షరాసి 178వ ర్యాంకు! ఈ పెద్దాయన జీవిత పాఠం మీకు చెప్పాలి..
Adilabad man secured 178th rank in ICET

Updated on: Jul 09, 2025 | 10:16 AM

హైదరాబాద్‌, జులై 9: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్‌ 2025 ఫలితాలు జులై 7న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఫలితాల్లో విద్యార్ధులతోపాటు ఓ పెద్దాయనకు అదీ 60 ఏళ్లు పైబడిన వ్యక్తికి ఏకంగా 178వ ర్యాంకు వచ్చింది. దీంతో ఈ విషయం కాస్తా టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. ఆయనెవరో.. ఆయన నేపథ్యం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

ఆదిలాబాద్‌లోని టీచర్స్‌కాలనీలో రావుల సూర్యనారాయణ అనే 65 ఏళ్ల వ్యక్తి నివాసం ఉంటున్నారు. ఆయన భార్య సునీత. వీరికి ఇద్దరు కుమారులు. ఆయన ఎల్‌ఐసీలో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్‌గా స్వచ్ఛంద రిటైర్‌మెంట్‌ తీసుకున్నారు. ఆమె ప్రభుత్వ టీచర్‌. పెద్ద కుమారుడు శశాంక్‌ మహారాష్ట్రలోని పర్బణీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. చిన్నకుమారుడు శరణ్‌ ఎంబీబీఎస్‌ చదువుతున్నాడు. అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో విధి ఆ కుటంబంపై పగబట్టింది. ఎంబీబీఎస్‌ అభ్యసిస్తున్న చిన్న కుమారుడు అనారోగ్యంతో హఠాత్తుగా చనిపోయాడు. 2020లో కరోనా మహమ్మారి భార్యను తీసుకుపోయింది. ఒకేసారి భార్య, కుమారుడు దైరమవడంతో మానసికంగా కుంగిపోయాడు. దీని నుంచి బయటపడటానికి మహారాష్ట్రలోని పెద్ద కుమారుడి వద్దకు వెళ్లారు.

ఇంతలో పరీక్షలు సరిగా రాయలేకపోయామని, పోటీ పరీక్షల్లో జాబ్‌ దక్కలేదని ఎందరో యువత ఆత్మహత్యలు చేసుకుంటున్న వార్తలు నిత్యం కోకొల్లలుగా రావడం చూసి ఆయన్ని చలించిపోయాడు. యువతకు ప్రాణాల విలువను తెలియజెప్పాలని, వారిలో ప్రోత్సాహం కలిగించాలని ఎలాంటి వయోపరిమితిలేని ఐసెట్‌ పరీక్ష రాసేందుకు సిద్ధపడ్డారు. గతేడాది పరీక్ష రాయగా 1,828 ర్యాంకు వచ్చింది. ఈ ఏడాది మరోమారు రాయడంతో ఏకంగా 178 ర్యాంకు వచ్చింది. చిన్న పరాజయానికే భయపడి తనువు చాలిస్తున్న యువతను చూస్తుంటే తన మనసు తల్లడిల్లిపోయిందని, అలాంటి వారిలో ఏఒక్కరైనా తనను స్ఫూర్తిగా తీసుకుంటారేమోననే చిన్న ఆశతోనే ఐసెట్ పరీక్ష రాసినట్లు ఆయన చెప్పారు. తాను ఐసెట్‌కు 3 నెలలు మాత్రమే సన్నద్ధమయ్యానని, రోజూ 3 నుంచి 4 గంటలు యూట్యూబ్‌ సాయంతో పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్‌ చేశానని, నోట్సు కూడా తయారు చేసుకున్నా తన ప్రిపరేషన్‌ ప్లాన్‌ వివరించారు. ఈ పెద్దాయన ప్రయత్నం నిజంగా అభినందనీయం. యువత తొందరపాటు నిర్ణయాలతో చేజేతులా జీవితాలను నాశనం చేసుకోవడం ఇకనైనా చాలించి.. సూర్యనారాయణ లాంటి వారిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలను చేరుకోవాలి. నిత్యకృషితో అనుకున్నది సాధించడం తథ్యం.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.