IIT: తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐఐటీ విద్యార్ధుల వరుస ఆత్మహత్యల వెనుక విస్తుపోయే నిజాలు..
అత్యంత కఠినమైన జేఈఈ ప్రవేశ పరీక్షలో ర్యాంక్ కొట్టి, ఐఐటీల్లో ప్రవేశం పొందడం అనేది తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది విద్యార్ధుల కల. ఐతే ఈ కల సాకారానికి విద్యార్ధులు భారీ మూల్యం చెల్లించవల్సి వస్తోంది. నివేదికల ప్రకారం..
అత్యంత కఠినమైన జేఈఈ ప్రవేశ పరీక్షలో ర్యాంక్ కొట్టి, ఐఐటీల్లో ప్రవేశం పొందడం అనేది తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది విద్యార్ధుల కల. ఐతే ఈ కల సాకారానికి విద్యార్ధులు భారీ మూల్యం చెల్లించవల్సి వస్తోంది. నివేదికల ప్రకారం 2014 నుంచి 2022 అక్టోబర్ మధ్య కాలంలో దేశంలోని వివిధ ఐఐటీల్లో చదువుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన విద్యార్థులు దాదాపు 15 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాజాగా ఐఐటీ గువహతిలో చదువుతున్న బీటెక్ విద్యార్ధి జీ మహేష్ సాయి రాజ్ అక్టోబర్ 10న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అకడమిక్ పర్ఫామెన్స్ సరిగ్గాలేదనే మనస్థాపంతో విద్యార్ధి మృతి చెందాడు. నిజానికి ఐఐటీల్లో విద్యార్ధుల జీవితం ఏ విధంగా ఉంటుంది? వారిలో కొరవడుతున్న స్కిల్స్ ఏమిటి? విద్యావేత్తలు ఏమంటున్నారు? వంటి విషయాలు పరిశీలిస్తే..
ఆ మూడు కారణాలతో తెలుగు రాష్ట్రాల విద్యార్ధులకు వేధింపులు..
2014 నుంచి ఐఐటీల్లో చదుతువున్న 34 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు డిసెంబర్ 2021లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంటులో వెల్లడించారు. ఐఐటీల్లో ఈ వరుస ఆత్మహత్యలపై సర్వత్రా కలత చెందుతున్నారు. విద్యార్ధుల ఆత్మహత్యలకు ప్రధానంగా మూడు కారణాలు ఉన్నట్లు పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, విద్యావేత్తలు చెబుతున్నారు. అవేంటంటే..
- సాధారణంగా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్ధుల్లో కొంతమంది విద్యార్థులు భాషా పరమైన అవరోధాలు ఎదుర్కొంటుంటారు.
- నార్త్ ఇండియా నుంచి వచ్చే వారితో పోల్చితే దక్షిణ భారత దేశం నుంచి వచ్చే విద్యార్ధులపై వివక్ష చూపడం/పక్షపాత ధోరణి.
- హైదరాబాద్‌లోని కొన్ని కోచింగ్ సెంటర్‌ల నుంచి వచ్చే విద్యార్ధులు మాత్రమే జేఈఈలో ర్యాంక్ సాధిస్తారని, వీరికి ఐఐటీలో చేరేంత లైఫ్ స్కిల్స్, ఆప్టిట్యూడ్ లేదనేది ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు వెలుపల ఉండే అత్యధికులు భావిస్తుంటారు.
కోచింగ్ సెంటర్లలో చదివిన విద్యార్ధులకు ఈ చిక్కులు తప్పవు..
ప్రత్యేక్యమైన కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో స్టడీ మెటీరియల్స్‌తో కుస్తీపట్టి, ప్రాక్టీస్ సెషన్‌ల ద్వారా జేఈఈలో ర్యాంక్‌లు సాధిస్తారని, సొంతంగా చదివే తెలివితేటలు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్ధులకు ఉండవని ఐఐటీల్లో ఉండే టీచర్లు, ఇతర విద్యార్ధులు బలంగా నమ్ముతారు అని ఐఐటీ-ఇండోర్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న ఓ తెలుగు విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు.
కమ్యునికేషన్‌తో ఇబ్బందులు..
నిర్దిష్ట కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి వచ్చే విద్యార్ధుల చదువు ఏ విధంగా ఉంటుందనే విషయంపై ప్రొఫెసర్లు సైతం వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుంటారు. ఐఐటీ ప్రిపరేషన్‌లో కోచింగ్ ఒక ప్రధాన భాగం. కోచింగ్ లేకుండా వచ్చేవారిని మైనారిటీలుగా పరిగణిస్తారు. తెలుగు విద్యార్ధులపై ఈ విధమైన వివక్ష ధోరణి బ్లాక్ మార్క్‌లా పడిపోయింది. తెలుగు/హిందీ/తమిళం ఏ భాషలోనైనా స్థానిక విద్యా నేపథ్యం ఉన్న విద్యార్థులు ఈ విధంగా ఐఐటీల్లో పరభవానికి గురువుతన్నారు. కోచింగ్ సెంటర్లలో టీచర్లు మాతృభాషను ఇంగ్లిష్ భాషతో మిక్స్ చేసి బోధిస్తారు. ఐఐటీల్లో కమ్యూనికేషన్ దాదాపు ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. అందువల్ల భాషాపరమైన అవరోధం ఐఐటీల్లో అధికంగా ఎదురవుతుంది. కోచింగ్ నుంచి నేరుగా ఐఐటీలకు ఎడ్యుకేషన్ మోడల్‌కు అకస్మాత్తుగా మారడంతో ప్రస్తుతం ఈ సమస్య యూనివర్సల్ ప్లాబ్లెంగా పరిణమిందని’ ఐఐటీ బాంబేలోని సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ అసోసియేట్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్ అనురాగ్ మెహ్రా వివరించారు.
‘చాలా మంది తెలుగు విద్యార్థులు హిందీ మాట్లాడే వారితో కమ్యునికేట్ చేయడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. వీరిలో సాఫ్ట్ స్కిల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే కోచింగ్ సెంటర్‌లు అకడమిక్స్‌పై ఎక్కువ దృష్టి పెడతాయి. ఇతర విషయాలను దాదాపుగా విస్మరిస్తాయి. దీంతో విద్యార్ధులు ఇతరులతో కమ్యూనికేట్ చేయలేని పరిస్థితిలో పడిపోతున్నారు. కమ్యునికేషన్ స్కిల్స్ అభివృద్ధి మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది’ అని ఖరగ్‌పూర్‌కు చెందిన ఓ ప్రొఫెసర్ అన్నారు.
అందుకే విద్యార్ధుల్లో స్ట్రెస్..
క్యాంపస్ జీవితం ఇండివిడ్యువల్‌గా ఉంటుంది. దీంతో ఓంటరిగా ఫీల్ అయ్యే విద్యార్ధులు తోటి ఫ్రెండ్స్‌లో ఓదార్పును కోరుకోవడం ప్రారంభిస్తే.. అటువంటి వారికి సరైన మద్ధతు దొరకదు. ఐఐటీల్లో చదివే స్టూడెంట్స్‌లో స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. పోటీతత్వం ఎక్కువ. ప్రతి స్టూడెంట్ తన పోరాటం చేస్తుంటాడు. మధ్యలో ఒకరు జారి పడిపోతే, ఎవరూ పట్టించుకోరు. గమ్యం చేరేంత వరకు ఎవరి పరుగు వారు పరిగెత్తాల్సిందే’ అని ఓ విద్యార్ధి తెలిపాడు.’నా ఎంటెక్ చదువుతున్నప్పుడు, నేను డిప్రెషన్‌లో ఉన్నాను. ఏకాగ్రతతో చదివేందుకు చాలా కష్టపడ్డాను. ప్రొఫెసర్ ఉదయం 5 గంటలకు మెసేజ్ చేస్తాడు. ఒక వేళ ఆ మెసేజ్ చూడకపోతే.. ఉదయం 7 గంటలకు తన క్యాబిన్‌కు పిలిపించుకుని, నా పర్ఫామెన్స్‌పై చివాట్లు వేస్తారని’ ఐఐటీ బాంబేలో చదివే ఓ విద్యార్థి తెలిపాడు.
సాధారణంగా ఐఐటీ క్యాంపస్‌లు సిటీలకు దూరంగా ఉంటాయి. చదువు ఒత్తిడి, ప్రొఫెసర్ల కఠిన వైఖరి అనేది కేవలం తెలుగు విద్యార్థులకే పరిమితం కానప్పటికీ.. ఇతర సమస్యలు కూడా వీరిలో మరింత స్ట్రెస్ పెరిగేందుకు దోహదపడుతున్నయి. ముఖ్యంగా వివక్షపూరితమైన వైఖరి మన విద్యార్ధులను ఆత్మహత్యలవైపు నడిపిస్తున్నాయి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.