Engineering Eligibility Test: నెట్, సెట్ మాదిరి.. ఇంజినీరింగ్ ప్రొఫెసర్ పోస్టులకూ అర్హత పరీక్ష..! మార్గదర్శకాలివిగో..
ఆర్ట్స్, సైన్స్ విభాగాలకు సంబంధించి జాతీయ స్థాయిలో నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష (నెట్), రాష్ట్ర స్థాయిలో నిర్వహించే రాష్ట్ర అర్హత పరీక్ష (సెట్) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే మాదిరి ఇంజినీరింగ్ సబ్జెక్టులకు మాత్రం ఏ పరీక్షలు లేవు. పైగా ఆర్ట్స్, సైన్స్ సబ్జెక్టులకు సంబంధించి ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి పీహెచ్‌డీ తప్పనిసరి. ఇంజినీరింగ్‌కు మాత్రం కేవలం ఎంటెక్ ఉంటే సరి. ఇకపై ఈ పప్పులేమీ ఉడకవ్. ఎందుకంటే..

హైదరాబాద్, ఏప్రిల్ 8: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో ఇంజినీరింగ్, ఇతర సాంకేతిక విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నియామక ప్రక్రియకు సంబంధించిన జీవోను సర్కార్ తాజాగా విడుదల చేసింది. ఇందులో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ప్రత్యేక రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఆ పరీక్షకు 10 నుంచి 20 మార్కుల వెయిటేజీ మాత్రమే ఉంటుంది. మిగిలిన 80 మార్కులు నాన్ ఇంజినీరింగ్ తరహాలోనే విద్యార్హతలు, పరిశోధన పత్రాలు, బోధన నైపుణ్యం లాంటి వాటికి కేటాయిస్తారు. పెద్ద మొత్తంలో వచ్చే దరఖాస్తుల వడపోతకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించాలని వర్సిటీల వీసీలంతా భావించారు. కొన్ని రాష్ట్రాల్లో రాత పరీక్ష నిర్వహిస్తే న్యాయపరమైన సమస్యలు వచ్చాయని ఉన్నత స్థాయి కమిటీ అనుమానం వ్యక్తం చేసింది. దీంతో నాన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీల భర్తీకి రాత పరీక్ష జరపరాదని సిఫారసు చేసింది. ఇంజినీరింగ్‌కు మాత్రం రాత పరీక్ష తప్పనిసరని సూచించింది. కమిటీ సిఫారసులను అంగీచరించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆ మేరకు జీఓ జారీ చేసింది.
ఆ విభాగాలకు రాత పరీక్ష ఎందుకంటే?
ఆర్ట్స్, సైన్స్ విభాగాలకు సంబంధించి జాతీయ స్థాయిలో జాతీయ అర్హత పరీక్ష (నెట్), రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర అర్హత పరీక్ష (సెట్) నిర్వహిస్తున్నారు. ఇంజినీరింగ్ సబ్జెక్టులకు మాత్రం ఏ పరీక్షలు లేవు. పైగా ఆర్ట్స్, సైన్స్ సబ్జెక్టులకు సంబంధించి ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి పీహెచ్‌డీ తప్పనిసరి. ఇంజినీరింగ్‌కు మాత్రం ఎలాంటి నిబంధనలు లేవు. కేవలం ఎంటెక్ ఉంటే అన్నింటికీ అర్హులుగా భావించేవారు. అందుకే ఇంజినీరింగ్‌కు అర్హత పరీక్షగా రాత పరీక్షను జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) తరహాలోనే 100 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థి పొందిన మార్కుల ఆధారంగా పీహెచ్‌డీ పూర్తిచేసిన వారికి 10 మార్కుల వెయిటేజీ, పీహెచ్‌డీ లేకుంటే 20 మార్కుల వెయిటేజీని నిర్ధారించి ప్రొఫెసర్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
ఈ పరీక్షను రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్వహిస్తుంది. జేఎన్‌టీయూహెచ్, ఆర్కిటెక్చర్ వర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ)తోపాటు బాసరలోని ఆర్‌జీయూకేటీ, ఓయూ, మహాత్మాగాంధీ వర్సిటీ, కాకతీయలలో ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించనున్నారు. తాజాగా 11 వర్సిటీలలో మొత్తం మంజూరు పోస్టులు 2,878గా ఉన్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. అందులో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 1572 ఉన్నాయి. వీటిల్లో 1114 ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో కనీసం 50 శాతం భర్తీ చేయనున్నారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నియామక ప్రక్రియ విధానాన్ని ఖరారు చేసి మార్గదర్శకాలను జారీ చేసింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.