మరికొన్ని రోజుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే వివిధ రంగాల వారు ఈ బడ్జెట్‌లోని అంశాలపై చాలా ఆశలు పెట్టుకున్నారు. వృద్ధిని వేగవంతం చేయడానికి రాబోయే యూనియన్ బడ్జెట్‌లో హాస్పిటాలిటీ రంగానికి పరిశ్రమ హోదా కల్పించాలనే డిమాండ్‌కు ఇప్పటికైన కేంద్ర ప్రభుత్వ ఆమోద ముద్ర వేస్తుందా? అని ఆ రంగ నిపుణులు వేచి చూస్తున్నారు. హాస్పిటాలిటీ రంగం దేశ జీడీపీకి గణనీయమైన సహకారాన్ని అందించిందని, కార్మిక, మూలధన ఆధారంగా పని చేసే ఈ రంగాన్ని పరిశ్రమగా గుర్తించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో హాస్పిటాలిటీ రంగ నిపుణులు ఏయే మినహాంపులు కోరుతున్నారో..? ఓ సారి తెలుసుకుందాం.
జీడీపీ ఉపాధి, విదేశీ మారకపు రాబడులకు పరిశ్రమకు సంబంధించిన గణనీయమైన సహకారాన్ని హాస్పిటాలిటీ రంగం అందిస్తుందని, పారిశ్రామిక హోదా లేకుండా పరిశ్రమ దాని వృద్ధిని నడపడానికి సహాయంగా నిలకడగా పురోగమించదని నిపుణులు చెబుతున్నారు. గత నెలలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ప్రీ-బడ్జెట్ సమావేశంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) అధ్యక్షుడు సంజీవ్ పూరి, ఐటీసీ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కూడా ఈ రంగానికి “పరిశ్రమ” అనే ట్యాగ్ ఇవ్వమని సూచించారు. తర్వాత ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా కూడా అన్ని వర్గాలలోని హోటళ్లకు మౌలిక సదుపాయాల హోదా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరింది.
కేంద్రం ఈ రంగంపై వస్తు సేవల పన్ను తగ్గించాలని, స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ఎక్కువ నిధులు కేటాయించాలని, సుస్థిర పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సాహకాలు అందించాలని కూడా కోరారు. ప్రస్తుతం హోటళ్లు మరియు రెస్టారెంట్లలోని వివిధ సేవలు వేర్వేరు జీఎస్టీ స్లాబ్‌లను అమలు చేస్తున్నారు. అన్ని వర్గాలకు 12 శాతం రేటు విధించాలని ఎఫ్‌హెచ్ఆర్ఏఐ తెలిపింది. బడ్జెట్‌లో పన్ను తగ్గింపు, వేగవంతమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, మెరుగుదల – ముఖ్యంగా కొత్తగా అభివృద్ధి చెందుతున్న టూరిజం జోన్‌లలో పర్యాటక ప్రమోషన్‌ను గణనీయంగా అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. ముఖ్యంగా స్థానిక, అంతర్జాతీయ పర్యాటకాన్ని మరింత పెంచడానికి విమానాశ్రయాల అప్‌గ్రేడేషన్‌పై తక్షణ శ్రద్ధ తీసుకోవాలని పలువురు నిపుణులు కోరుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..