Gold Price: బంగారం ధర రూ.3 లక్షలకు చేరుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
ప్రస్తుతం ఎక్కడ చూసినా బంగారం గురించే చర్చ జరుగుతోంది. దానికి కారణం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు కొద్ది కాలంలోనే విపరీతంగా పెరగడం. ఈ ఒక్క ఏడాదిలో బంగారం ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. ఈ ట్రెండ్ చూస్తుంటే బంగారం ధర రూ. 3 లక్షల మార్క్ చేరుకుంటుందా? అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. మరి దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.

ఒక్క 2025 సంవత్సరంలోనే బంగారం ధరలు సుమారు 67 శాతానికి పైగా పెరిగాయి. ప్రస్తుతం అక్టోబర్ 21 నాటికి బంగారం ధర ఆల్ టై హయ్యెస్ట్ కు చేరుకుంది. 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,850 ఉంది. బంగారం ధరల్లో ఈ పెరుగుదల స్టాక్ మార్కెట్లను కూడా అధిగమించింది. ఈ పెరుగుదలను బట్టి చూస్తుంటే 2030 నాటికి బంగారం ధరలు 10 గ్రాములకు రూ.3 లక్షలకు చేరుకుంటుందా అన్న అనుమానం కలుగుతోంది.
రికార్డు స్థాయిలో..
గత వందేళ్ల చరిత్రలో బంగారం ధరలు ఇంతగా పెరగడాన్ని ఎప్పుడూ చూడలేదని ఆర్థిక నిపుణుల అభిప్రాయపడుతున్నారు. కేవలం 18 నెలల్లోనే బంగారం ధరలు రెట్టింపు అవ్వడం గతంలో ఎప్పుడూ లేదని అంటున్నారు. అయితే గతంలో బంగారం ధరలు రిజర్వ్ బ్యాంకుల వల్ల పెరిగేవి. కానీ, ఇప్పడు కేవలం ప్రైవేట్ పెట్టుబడిదారుల వల్లనే ధరల్లో ఈ మార్పు ఉన్నట్టు డేటా ప్రకారం తెలుస్తోంది. గడచిన ఏడాది కాలంలో గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుబడులు రెట్టింపు అయ్యాయి. గత కొంత కాలంగా దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, అమెరికా వడ్డీ రేట్లలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల ప్రజల్లో సేఫ్ పెట్టుబడి ఆప్షన్ గా బంగారం కనిపిస్తోంది. దాంతో బంగారంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఫలితంగా ధరలు పెరుగుతున్నాయి.
2030 నాటికి..
ఒకప్పుడు1980లో సామాన్య ప్రజలు వారి ఆస్తుల్లో సుమారు 8 శాతం బంగారంలో పెట్టేవారు. కానీ 2010లలో అది 2 నుంచి 3 శాతానికి తగ్గింది. అయితే ఇప్పుడు మళ్లీ పెరుగుతోంది. ఇవన్నీ బంగారం ధరలు మరింత పెరగడానికి అవకాశాలు కల్పిస్తున్నాయి. ప్రపంచంలో వాణిజ్య అస్థిరత ఇలాగే కొనసాగితే 2027 నాటికి కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోలు మళ్లీ పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాంతో 2027 నాటికి బంగారం ధర రూ.2 లక్షలు(పది గ్రాములకు) దాటే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ఒకవేళ వాణిజ్య అస్థిరత 2030 వరకూ కొనసాగితే బంగారం ధర రూ. 3 లక్షలకు చేరడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదంటున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




