AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రతి నెలా టైమ్‌కి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించినా.. CIBIL Score తగ్గుతుందా?

ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తేనే మీ సిబిల్ స్కోర్ (CIBIL Score) లేదా క్రెడిట్ స్కోర్ (Credit Score) మెరుగ్గా ఉంటుంది. మంచి సిబిల్ స్కోర్ భవిష్యత్తులో తక్కువ వడ్డీతో బ్యాంకు రుణాలు పొందేందుకు, కొత్త క్రెడిట్ కార్డులు పొందడానికి దోహదపడుతుంది. గడువు తేదీకి ముందే మీ క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించడం మంచి అలవాటే.. అయితే, అంతటితోనే మంచి సిబిల్ స్కోర్ వస్తుందని అనుకోవడం సరైంది కాదు. క్రెడిట్ లిమిట్‌ను మితంగా వినియోగించడం, మొత్తం బిల్లు చెల్లించడం, క్యాష్ విత్‌డ్రాలను నివారించడం తదితర ఆర్థిక క్రమశిక్షణ చర్యలతు మీ క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉంటుంది.

ప్రతి నెలా టైమ్‌కి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించినా.. CIBIL Score తగ్గుతుందా?
Credit CardImage Credit source: Pexels
Janardhan Veluru
|

Updated on: Jul 22, 2026 | 12:29 PM

Share

క్రెడిట్ కార్డు చెల్లింపుల కారణంగా సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ తగ్గిపోవద్దంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని కీలకమైన అంశాలపై అవగాహన కూడా అవసరం. క్రెడిట్ కార్డ్ బిల్లు ప్రతి నెలా డ్యూ డేట్‌కు ముందే పూర్తిగా చెల్లిస్తున్నప్పటికీ.. సిబిల్ స్కోర్ తగ్గిపోవడాన్ని కొందరు గమనిస్తుంటారు. దీంతో బిల్లు నిర్ణీత గడువు కంటే ముందే చెల్లిస్తున్నా స్కోర్ ఎందుకు పడిపోతోంది? అనే సందేహం చాలామందికి వస్తుంది. వాస్తవానికి కేవలం సమయానికి బిల్లు చెల్లించడం ఒక్కటే మంచి క్రెడిట్ స్కోర్‌కు సరిపోదు. మీ క్రెడిట్ కార్డ్ వినియోగించే విధానం కూడా క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతుందని తెలుసుకోవాలి. ఏయే అంశాలు మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి.

1. హై క్రెడిట్ యుటిలైజేషన్ (High Credit Utilization)

సిబిల్ స్కోర్ తగ్గడానికి ప్రధాన కారణాల్లో ఇది ఒకటి. మీ క్రెడిట్ కార్డ్‌కు రూ.1 లక్ష గరిష్ఠ లిమిట్ ఉంటే, ప్రతి నెలా రూ.80 వేల నుంచి రూ. 90 వేల వరకు ఖర్చు చేసి.. తర్వాత సమయానికి బిల్లు చెల్లించినా క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు అందుబాటులో ఉన్న క్రెడిట్‌లో ఎక్కువ భాగాన్ని ఉపయోగిస్తున్నారని, అప్పులపై అధికంగా ఆధారపడుతున్నారని క్రెడిట్ బ్యూరోలు భావిస్తాయి. దీనినే హై క్రెడిట్ యుటిలైజేషన్ అంటారు. ఇది క్రెడిట్ స్కోరుపై నెగటివ్ ప్రభావం చూపుతుంది.

2. క్రెడిట్ కార్డ్‌తో క్యాష్ విత్‌డ్రా చేయడం

చాలామంది అత్యవసర పరిస్థితుల్లో క్రెడిట్ కార్డ్ ద్వారా ATM నుంచి నగదు డ్రా చేస్తుంటారు. అయితే ఇది మంచి ఆర్థిక అలవాటు కాదు. క్రెడిట్ కార్డ్ నుంచి క్యాష్ విత్‌డ్రా చేసిన వెంటనే అధిక వడ్డీ, అదనపు ఛార్జీలు వర్తించే అవకాశం ఉంటుంది. అలాగే క్రెడిట్ కార్డుపై నగదు విత్‌డ్రా మీ క్రెడిట్ ప్రొఫైల్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపించి సిబిల్ స్కోర్ తగ్గడానికి కారణమవుతుంది.

ఇవి కూడా చదవండి

3. మినిమమ్ డ్యూ మాత్రమే చెల్లించడం

క్రెడిట్ కార్డ్ బిల్లు మొత్తం చెల్లించకుండా..కేవలం “Minimum Due” మాత్రమే చెల్లించడం వల్ల లేట్ ఫీజు నుంచి తప్పించుకోవచ్చు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. చెల్లించని కార్డు బిల్లుపై అధిక వడ్డీ విధించబడుతుంది. అప్పు భారం క్రమంగా పెరిగి, భవిష్యత్తులో మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

4. తరచుగా కొత్త క్రెడిట్ కార్డులు లేదా లోన్లకు దరఖాస్తు చేయడం

తక్కువ వ్యవధిలో ఎక్కువ క్రెడిట్ కార్డులు లేదా వ్యక్తిగత రుణాలకు దరఖాస్తు చేస్తే, ప్రతి అప్లికేషన్‌పై బ్యాంకులు చేసే హార్డ్ ఇంక్వైరీ (Hard Inquiry) కారణంగా కూడా మీ క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది.

5. పాత క్రెడిట్ కార్డులను మూసివేయడం

చాలా కాలంగా ఉపయోగిస్తున్న క్రెడిట్ కార్డును మూసివేస్తే మీకు అందుబాటులో ఉన్న మొత్తం క్రెడిట్ లిమిట్ తగ్గుతుంది. దీంతో క్రెడిట్ యుటిలైజేషన్ శాతం పెరిగి, క్రెడిట్ హిస్టరీ కూడా తగ్గే అవకాశం ఉండటంతో సిబిల్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడవచ్చు.

సిబిల్ స్కోర్ పెంచుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి

30% రూల్ పాటించండి: మీ మొత్తం క్రెడిట్ లిమిట్‌లో 30 శాతం కంటే ఎక్కువ ఖర్చు చేయకుండా కార్డును వాడాలి. ఉదాహరణకు రూ.1 లక్ష లిమిట్ ఉంటే.. సాధ్యమైనంత వరకు రూ.30,000 లోపే కార్డును వినియోగించడం మంచిది.

మొత్తం బిల్లు చెల్లించండి: ప్రతి నెలా డ్యూ డేట్‌కు ముందే Total Amount Due పూర్తిగా చెల్లించండి.

క్యాష్ విత్‌డ్రాలను నివారించండి: అత్యవసర పరిస్థితులు మినహా క్రెడిట్ కార్డ్‌తో ATM నుంచి నగదు డ్రా చేయవద్దు.

ఒకేసారి ఎక్కువ లోన్లకు అప్లై చేయవద్దు: అవసరం ఉన్నప్పుడే కొత్త క్రెడిట్ కార్డు లేదా రుణానికి దరఖాస్తు చేయండి.

పాత కార్డులను వెంటనే క్లోజ్ చేయొద్దు: వార్షిక ఛార్జీలు లేకపోతే, పాత క్రెడిట్ కార్డును యాక్టివ్‌గా ఉంచడం మంచిది.

క్రెడిట్ రిపోర్ట్‌ను తరచూ పరిశీలించండి: మీ క్రెడిట్ రిపోర్ట్‌లో ఏవైనా తప్పులు ఉన్నాయా లేదా అనేది కాలానుగుణంగా చెక్ చేయండి.

Follow Us