Wheat prices: గోధుమల ఎగుమతిపై నిషేధంతో అంతర్జాతీయ మార్కెట్‌లో భారీగా పెరిగిన ధరలు..
భారత ప్రభుత్వం గోధుమల(Wheat) ఎగుమతిపై నిషేధం విధించిన తర్వాత కూడా విదేశీ మార్కెట్లలో గోధుమ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి...
భారత ప్రభుత్వం గోధుమల(Wheat) ఎగుమతిపై నిషేధం విధించిన తర్వాత కూడా విదేశీ మార్కెట్లలో గోధుమ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. యూరోపియన్ మార్కెట్‌లో గోధుమ ధరలు టన్నుకు 435 యూరోలు అంటే రూ. 35,282.73కు పెరిగాయి. రష్యా-ఉక్రెయిన్(Russia, Ukraine crisis) యుద్ధం నేపథ్యంలో భారత్ గోధుమల ఎగుమతులపై నిషేధం విధించడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని జీ-7(G-7) దేశాల బృందం విమర్శించింది. భారతదేశం చర్య ప్రపంచవ్యాప్తంగా కమోడిటీ ధరల సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని జర్మనీ వ్యవసాయ మంత్రి కెమ్ ఓజ్డెమిర్ అన్నారు. వచ్చే నెలలో జర్మనీలో జరగనున్న జీ-7 సదస్సులో ఈ అంశం చర్చకు రానుంది. ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా పాల్గొననున్నారు. ప్రస్తుతం భారత్ 69 దేశాలకు గోధుమలను ఎగుమతి చేస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 69 దేశాలకు 78.5 లక్షల టన్నుల గోధుమలను ఎగుమతి చేసింది.
రష్యా అతిపెద్ద గోధుమ ఎగుమతిదారు
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా గోధుమ ఎగుమతులు కూడా ప్రభావితమయ్యాయి. చైనా, భారతదేశం తర్వాత రష్యా అతిపెద్ద గోధుమ ఉత్పత్తిదారుగా ఉంది. గోధుమల ఎగుమతి పరంగా మొదటి స్థానంలో ఉంది. గోధుమలను ఎగుమతి చేసే దేశాలలో ఉక్రెయిన్ ఐదవ స్థానంలో ఉంది. యూఎస్, లెబనాన్, నైజీరియా, హంగేరితో సహా అనేక దేశాలు రష్యా నుంచి గోధుమలు, ముడి చమురుతో సహా ప్రతిదానిని ఎగుమతి చేయడాన్ని నిషేధించాయి. దీంతో గోధుమల కొరత నెలకొంది. అటువంటి పరిస్థితిలో ఈ కొరతను తీర్చడానికి భారతదేశం గోధుమల ఎగుమతిని పెంచింది. కానీ ఇప్పుడు భారత్ గోధుమ ఎగుమతులపై నిషేధం తర్వాత, గోధుమలు విదేశీ మార్కెట్లలో ఖరీదైనవిగా మారడం ప్రారంభమయ్యాయి.
గోధుమ ధరలు 60% పెరిగాయి
రష్యా, ఉక్రెయిన్ రెండూ ప్రధాన గోధుమ ఎగుమతిదారులు. ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత సరఫరా ఆందోళనల కారణంగా గోధుమ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోధుమల ధరలు 60% పెరిగాయి. గోధుమల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది. భారత్‌లో ఏటా 107.59 మిలియన్ టన్నుల గోధుమలు ఉత్పత్తి అవుతాయి. ఇందులో ఎక్కువ భాగం దేశీయ వినియోగానికి ఉపయోగిస్తున్నారు. దేశంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, గుజరాత్ గోధుమలను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలుగా ఉన్నాయి.
మరిన్ని వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి…