UPI Payments: ఇక మరింత వేగంగా యూపీఐ చెల్లింపులు.. అమల్లోకి కొత్త నిబంధనలు
భారతదేశంలో డిజిటల్ పేమెంట్లు రోజురోజుకూ వృద్ధి చెందుతున్నాయి. 2016లో నోట్ల రద్దు సమయంలో అందుబాటులోకి తీసుకొచ్చిన యూపీఐ చెల్లింపులు తక్కువ సమయంలో ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా దేశంలో చిల్లర సమస్యకు యూపీఐ చెల్లింపులతో చెక్ పడింది. తాజాగా యూపీఐ చెల్లింపులు మరింత వేగంగా సాగుతున్నాయని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో యూపీఐ చెల్లింపుల వేగం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

యూపీఐ చెల్లింపు జూన్ 16న మరింత వేగంగా సాగాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) కొత్త ఆదేశాలతో వేగవంతమైన చెల్లింపులు సాధ్యమయ్యాయని చెబుతుననారు. బ్యాంకులు, చెల్లింపు యాప్‌లతో సహా అన్ని యూపీఐ యాప్‌లు యూపీఐ ఆధారిత ఆర్థిక, ఆర్థికేతర సేవలకు గరిష్ట ప్రతిస్పందన సమయాన్ని తగ్గించాలని ఆదేశించింది. ఈ కొత్త నిబంధనల నేపథ్యంలో యూపీఐ లావాదేవీని పూర్తి చేయడానికి పట్టే సమయం అంటే డబ్బు పంపడం లేదా స్వీకరించడమైన 15 సెకన్లకు పరిమితం అయ్యింది.
గతంలో యూపీఐ చెల్లింపులకు గరిష్ట సమయం 30 సెకన్లుగా ఉంటే ఎన్‌పీసీఐ దాన్ని 15 సెకన్లకు తగ్గించింది. ఈ తగ్గింపు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి అన్ని యూపీఐ ప్లాట్‌ఫారమ్‌లతో సహా యోనో ఎస్‌బీఐ, ఐమొబైల్ పే, ఇతర బ్యాంకింగ్ యాప్‌లకు వర్తిస్తుంది. సాధారణంగా ఓ వ్యక్తి క్యూార్ కోసం స్కాన్ చేశాక సంబంధిత బ్యాంక్ ఎన్‌పీసీఐ సిస్టమ్ ద్వారా మరో బ్యాంకునకు “చెల్లింపు” అభ్యర్థనను పంపుతుంది. ఆ బ్యాంకు ఖాతా యాక్టివ్‌గా ఉందా? లేదా వివరాలు సరిగ్గా ఉన్నాయా? వంటి విషయాలను తనిఖీ చేసి డబ్బు అందినట్లు నిర్ధారణను తిరిగి పంపుతుంది. ఈ నిర్ధారణ ఎన్‌పీసీఐ సిస్టమ్ ద్వారా సంబంధిత బ్యాంక్‌కు తిరిగి వెళుతుంది. దాంతో మన మొబైల్‌లో ట్రాన్స్‌యాక్షన్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది.
ఇప్పటి వరకు ఈ మొత్తం ప్రక్రియకు 30 సెకన్లు పట్టేది. కానీ జూన్ 16, 2025 నుంచి దీనికి కేవలం 15 సెకన్లు మాత్రమే పడుతుంది. కేవలం చెల్లింపులు మాత్రమే కాకుండా లావాదేవీ స్థితిని తనిఖీ చేయడం లేదా విఫలమైన చెల్లింపులను తిరిగి పొందడం వంటి కార్యకలాపాలు ఇప్పుడు 30 సెకన్లకు బదులుగా కేవలం 10 సెకన్లు మాత్రమే పడుతుంది. కాబట్టి లావాదేవీ విషయంలో తప్పు జరిగితే మీరు ఆ లావాదేవికి సంబంధించిన అప్‌డేట్ పొందడానికి లేదా దానిని తిరిగి పొందడానికి ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








