UPI Payments: యూపీఐ కొత్త రూల్స్.. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ చెల్లింపులకు కూడా ఛార్జీలు పడతాయా..?
యూపీఐ యూజర్లకు కేంద్రం బ్యాడ్ న్యూస్ అందించింది. యూపీఐ లావాదేవీలకు ఛార్జీలు విధింపునకు సిద్దమైంది. వ్యాపారులకు యూపీఐ లావాదేవీలకు ఎండీఆర్ ఛార్జీలు విధించనుంది. వచ్చే నెల 15వ తేదీ నుంచి దీనిని అమలు చేయనుంది. ఇక ఇన్సూరెన్స్ చెల్లింపులకు కూడా ఛార్జీలు పడనున్నాయి.

కేంద్ర ప్రభుత్వం యూపీఐ లావాదేవీలకు చార్జీలు విధించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఉచితంగా యూపీఐ సౌకర్యం ఉపయోగించుకోగా.. ఇక నుంచి వ్యాపారులకు మర్చంట్ డిస్కౌంట్ రేట్(MDR) అమలు చేసేందుకు సిద్దమైంది. వ్యాపారుల వద్ద రూ.2 వేలుపైబడి చేసే ట్రాన్సాక్షన్లకు 0.4 శాతం యూపీఐ ఛార్జీలు విధించనుంది. ఇక ఇన్సూరెన్స్, సిప్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ బ్రోకింగ్, సెక్యూరిటీల చెల్లింపులకు వేర్వేరుగా ఛార్జీలు పడనున్నాయి. అక్టోబర్ 15వ తేదీ నుంచి వీటిని అమలు చేయనున్నట్లు ఎన్‌పీసీఐ ప్రకటించింది. వేటిపై ఎంతెంత చార్జీలు ఉంటాయనేది ఇప్పుడు చూద్దాం.
ఇన్సూరెన్స్ చెల్లింపులకు ఎంత ఛార్జీ పడుతుంది..?
ఇన్యూరెన్స్ చెల్లింపులకు ఫ్లాట్ రూ.5 చార్జీ విధిస్తారు. బీమా ప్రీమియం చెల్లింపులు, ఇన్సూరెన్స్‌కు సంబంధించిన అన్ని చెల్లింపులకు ఇవి వర్తిస్తుంది. రూ.2 వేలు దాటిన ట్రాన్సాక్షన్లకు మాత్రమే వర్తింపచేస్తారు. ఇక మ్యూచువల్ ఫండ్‌లు, సెక్యూరిటీలు, స్టాక్‌బ్రోకింగ్ చెల్లింపులకు 0.02 శాతం MDR విధించబడుతుంది. దీని గరిష్ట పరిమితి రూ.300 విధించారు. వినియోగదారులు ఈ ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం లేదు. వినియోగదారుల నుంచి డబ్బులు స్వీకరించినందుకు బ్యాంకులు, పేమెంట్ ఆపరేటర్లకు వ్యాపారి చెల్లించాలి. వ్యాపారి ఈ ఖర్చులను వినియోగదారులకు బదిలీ చేయకూడదు. ఇక నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, జియోహాట్‌స్టార్ వంటి OTT సబ్‌స్క్రిప్షన్లు, యుటిలిటీ బిల్లులను ఆటో పేమెంట్ విధానంలో చెల్లిస్తుంటే భిన్నంగా పరిగణిస్తారు. ఇలాంటి చెల్లింపులను పునరావృత చెల్లింపులుగా పరిగణిస్తారు. దీంతో ఈ చెల్లింపులపై ఎటువంటి ఛార్జీలు ఉండవు.
OTT సబ్‌స్క్రిప్షన్‌లు, మొబైల్ బిల్లులు, విద్యుత్ బిల్లులు, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్‌ల వంటి సేవల కోసం UPI ఆటో పేమెంట్ విధానంలో చెల్లిస్తుంటే.. ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు. ఇక మిగతా వ్యాపారుల వద్ద రూ.2 వేలుపైబడి చేసే పేమెంట్లకు 0.4 శాతం ఎండీఆర్ ఉంటుంది. రూ.75 వేల కంటే ఎక్కువ చేస్తే చెల్లింపులపై రూ.300 వరకు ఉంటుంది. ఇక రైల్వేలు, టెలికాం, ఇన్యూరెన్స్, ఇంధనం, వ్యవసాయ ఉత్పాదకాలు వంటి రంగాల్లో ప్రతి లావాదేవీకి రూ.5 చార్జీ ఉంటుంది. అయితే ఆగస్టులో 29,823 బిలియన్ రూపాయల యూపీఐ లావాదేవీలు జరిగాయి. డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ వాటా 84 శాతంగా ఉంది. ప్రపంచ రియల్ టైం చెల్లింపుల్లో 47 శాతంగా ఉంది. కాగా వ్యక్తుల మధ్య జరిగే యూపీఐ లావాదేవీలు పూర్తిగా ఉచితం. దీంతో సామాన్యులపై ఈ ఛార్జీల భారం ఉండదని కేంద్రం చెబుతోంది. కేవలం పెద్ద వ్యాపారులపై మాత్రమే ప్రభావం చూపుతుందని స్పష్టం చేసింది.
