September 16, 2026
Subhash
UPI వినియోగదారులకు కీలక అప్‌డేట్. అక్టోబర్ 15, 2026 నుంచి కొన్ని మర్చంట్ UPI పేమెంట్లపై 0.4% MDR అమల్లోకి రానుంది. అయితే ఈ ఛార్జీ నేరుగా కస్టమర్లపై ఉండదు.
రూ.2,000 వరకు చేసే సాధారణ UPI మర్చంట్ పేమెంట్లపై MDR ఉండదు. రూ.2,000 కంటే ఎక్కువ ఉన్న నిర్దిష్ట P2M లావాదేవీలకు 0.4% MDR వర్తిస్తుంది.
ఇక్కడే అసలు విషయం. MDRను మర్చంట్‌నే భరిస్తాడు. కస్టమర్ UPI ద్వారా చెల్లించే బిల్లుపై ప్రత్యేకంగా MDR వసూలు చేయకూడదు. UPI యాప్‌లు కూడా అదనపు ప్లాట్‌ఫామ్ ఫీజు లేదా దాచిన ఛార్జీలు విధించకూడదు.
ఉదాహరణకు మీరు షాపులో రూ.3,000 UPI ద్వారా చెల్లిస్తే.. 0.4% ప్రకారం మర్చంట్‌కు రూ.12 MDR వర్తిస్తుంది. అయితే మీరు మాత్రం రూ.3,000నే చెల్లిస్తారు.
పెద్ద మొత్తాల పేమెంట్లకు కూడా MDRకు పరిమితి ఉంది. రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలపై గరిష్ఠ MDR రూ.300గా ఉంటుంది. అంటే రూ.1 లక్ష పేమెంట్ చేసినా MDR రూ.300కు మించదు.
రైల్వేలు, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధనం, వ్యవసాయ ఇన్‌పుట్స్ వంటి కొన్ని రంగాల్లో రూ.2,000కు పైబడిన పేమెంట్లకు ఫ్లాట్ రూ.5 MDR విధానం ఉంటుంది.
స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా ఇతర వ్యక్తులకు చేసే P2P UPI ట్రాన్స్‌ఫర్లు ఎంత పెద్ద మొత్తంలో ఉన్నా ఉచితంగానే ఉంటాయి. చిన్న వ్యాపారులకు కూడా ప్రత్యేక మినహాయింపులు ఉన్నాయి.
ప్రభుత్వం ప్రకారం, కొత్త MDR విధానం సుమారు 4% మర్చంట్ UPI లావాదేవీలకే వర్తిస్తుంది. అంటే దాదాపు 96% మర్చంట్ లావాదేవీలు యథావిధిగా ఛార్జీలు లేకుండా కొనసాగుతాయి.