Indian Banks: అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఇక తప్పనిసరిగా వెళ్లాల్సిందే.. బ్యాంకుల్లో కీలక మార్పులు..
బ్యాంక్ అకౌంట్ మోసాలు భారీగా పెరుగుతున్నాయి. అంతేకాకుండా నకిలీ అకౌంట్లు కూాడా బయటపడుతున్నాయి. దీంతో బ్యాంకులు కీలక మార్పులు చేశాయి. బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్‌కు సంబంధించి పాత పద్దతులను అనుసరించాలని నిర్ణయించాయి. ఇప్పటికే కొన్ని బ్యాంకులు ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చాయి.

Account Opening: బ్యాంక్ అకౌంట్ అనేది ఈ రోజుల్లో ప్రతిఒక్కరికీ అవసరమే. డిజిటల్ పేమెంట్లు పెరుగుతున్న క్రమంలో బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరి అయింది. నగుదు వేరేవారికి పంపించాలన్నా.. లేదా ఇతరుల నుంచి స్వీకరించాలన్నా బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాల్సిందే. దేశంలో బ్యాంక్ అకౌంట్ లేనివారంటూ ఎవరూ ఉండరు. కొంతమంది వేర్వురు అవసరాల కోసం ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు వినియోగిస్తున్నారు. అకౌంట్ కావాలంటే ఒకప్పుడు బ్యాంక్‌కు వెళ్లాల్సి వచ్చేంది. ఏదైనా గుర్తింపు ధృవీకరణ పత్రం ఇచ్చి అప్లికేషన్ పూర్తి చేస్తే అకౌంట్ ఇచ్చేవారు. కానీ టెక్నాలజీ మరింత అభివృద్ది చెందాక ఆన్‌లైన్‌లోనే సులువుగా అకౌంట్ ఓపెన్ చేసుకునే వెసులుబాటు లభించింది.
మళ్లీ పాత పద్దతిలో..
ఆన్‌లైన్‌లో అకౌంట్ ఓపెనింగ్‌కు సంబంధించి బలమైన కేవైసీ నిబంధనలు పాటించకపోవడంతో ఇటీవల పలు బ్యాంక్‌లకు ఆర్‌బీఐ జరిమానా విధించింది. దీంతో మళ్లీ పాత పద్దతిలోనే బ్యాంక్ అకౌంట్లు కస్టమర్లకు అందించాలని పలు బ్యాంకులు మార్పులు చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు కూడా ఇవే పద్దతిలోకి మారాయి. దీంతో కస్టమర్లు ఇక అకౌంట్ ఓపెన్ చేయాలంటే బ్రాంచ్‌కు వెళ్లాల్సి వస్తుంది. బ్యాంక్‌కు వెళ్లి ధృవీకరణ పత్రాలు అందిస్తే గానీ అకౌంట్ ఓపెన్ చేయడం కుదరదు.
ఆన్‌లైన్ సేవలు బంద్
ఆర్బీఐ నుంచి జరిమానాలు రావడంతో బ్యాంకులు ఆన్‌లైన్‌లో అకౌంట్ ఓపెన్ చేసే సేవలను తాత్కాలికంగా బంద్ చేశాయి. మొన్నటివరకు ఆన్‌లైన్‌లో అకౌంట్ ఓపెన్ ప్రక్రియను వేగవంతం చేసిన బ్యాంకులు.. ఇప్పుడు రూట్ మార్చుకుని పాత పద్దతిలోకి వస్తున్నాయి. గుర్తింపు చోరీలు, మ్యూల్ అకౌంట్లు పెరుగుతుండటంతో పలు మోసాలు చోటుచేసుకుంటున్నాయి. ఆన్‌లైన్‌లో అకౌంట్‌ను ప్రారంభించే ప్రక్రియను బ్యాంకులు నిలిపివేయడానికి ఇదే కారణంగా తెలుస్తోంది.
పెరుగుతున్న మోసాలు
2024-25 ఆర్ధిక సంవత్సరంలో మోసాల సంఖ్య భారీగా పెరిగింది. గత ఏడాదిలో 23,953 బ్యాంకు మోసాలు నమోదవ్వగా.. వీటి విలువ రూ.36,014గా ఉంది. రూ.లక్ష అంతకంటే ఎక్కువ మోసాలనే ఇందులో పరిగణలోకి తీసుకున్నారు. ఇక క్రెడిట్ కార్డు మోసాల విలువ రూ.520 కోట్లు, లోన్ల మోసాల విలువ రూ.33,148గా ఉంది. ఇక చిన్న మొత్తాల్లో పోగొట్టుకున్నవారు లక్షల మందిలోనే ఉన్నారు.




